జైరాం ఓకే.. అన్నయ్యను వదిలేశావేం పవన్?

Update: 2016-08-28 05:40 GMT
తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకి లేని విలక్షణమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సొంతం. ఆ మాటకు వస్తే సినీ అభిమానులే కానీ.. రాజకీయంగా కూడా పవన్ ను అభిమానించే వారు భారీగా కనిపిస్తారు. ఆయన ఇమేజ్ ఎంత? ఆయన మాటకు ఉన్న విలువ ఎంత? పవన్ నోటి మాటల్ని ఓట్ల రూపంలో మారిస్తే అదెలా ఉంటుందన్నది 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

తన పేరును ఒక బ్రాండ్ గా మార్చటమే కాదు.. తన విధానాల్ని ఒక ఇజంగా చెప్పుకునే అభిమానులు పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉందని చెప్పటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రోజు కంటే తక్కువ వ్యవధిలో బహిరంగ సభను నిర్వహించటం ఒక ఎత్తు అయితే.. ఆ సభను విజయవంతంగా నిర్వహించటం మరో ఎత్తు. పవన్ పిలిస్తే.. ప్రజల్లో ఎలాంటి కదలిక ఉంటుందన్న విషయం తిరుపతి సభ చెప్పకనే చెప్పేసింది.

ఈ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్ కీలకమైన అంశాల్ని ప్రస్తావించారు. ప్రత్యేక హోదా చుట్టూనే ఆయన ప్రసంగం ఎక్కువసేపు తిరిగింది. ఈ సందర్భంగా విభజన అంశాన్ని ప్రస్తావించటం అనివార్యమే. విభజనలో కీలక పాత్రధారి అయిన కేంద్రమాజీ మంత్రి జైరాం రమేశ్ ను వ్యంగ్యంగా విమర్శిస్తూ.. సటైరిక్ గా తిట్టిన తీరు పలువురిని ఆకర్షించింది. సీమాంధ్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన జైరాం రమేశ్  ఏపీ విభజన బిల్లును రూపొందించటంలో  కీలకభూమిక పోషించిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. ‘‘ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికి ఆయన్ను మర్చిపోరు. ఆయనకంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన నవ్వుతూనే మన రాష్ట్రం నుంచి ఎన్నికై.. నవ్వుతూనే నిలువునా రాష్ట్రాన్ని చీల్చేశారు. ఆయన తెలివికి.. మేధస్సుకు హ్యాట్సాఫ్. జైరాం రమేశ్ కు మీరు కూడా ఒక్కసారి క్లాప్స్ కొట్టండి’’ అని వ్యాఖ్యానించారు.

ఇంత వ్యంగ్యంగా జైరాంను ఏసుకున్న పవన్.. తన సోదరుడు.. నాటి యూపీఏ సర్కారులో కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న చిరంజీవి తీరును కూడా ప్రశ్నించి ఉంటే బాగుండేది. అన్నగా చిరంజీవి మీద పవన్ కున్నఅభిమానాన్ని ఎవరూ శంకించలేరు. అయితే.. సీమాంధ్రుల ప్రయోజనాల విషయానికి వస్తే.. తన అన్న కానీ.. తన ఇంట్లోని కుటుంబ సభ్యులు కానీ ఎవరి మాటను తాను వినన్న విషయాన్ని జనసేన పార్టీ ఆవిర్భావంతోనే స్పష్టం చేశారు.

మరి.. అలాంటి పవన్.. తిరుపతి సభలో జైరాం రమేశ్ తో పాటు.. నాటి కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న చిరంజీవి ప్రస్తావన తీసుకొస్తే బాగుండేది. రాష్ట్ర విభజన పాపం జైరాం రమేశ్ అకౌంట్లో వేయటం సరిపోదు. ఆయన నవ్వుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించినప్పుడు.. తన అన్న చిరంజీవి ఏం చేశారు? ఎలాంటి ప్రయత్నం చేశారు? జైరాం రమేశ్ ముఖంలో చిరునవ్వు ఆగేలా ఎందుకు ప్రయత్నించలేదు? అన్న ప్రశ్నలు వస్తాయి. వీటికి సమాధానమైనా చెప్పాలి.. లేదంటే తన అన్న చేసిన తప్పును కూడా భావోద్వేగాలకు.. వ్యక్తిగత సంబంధాలకు అతీతంగా ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు. కానీ.. ప్రాధమిక దశలోనే అలాంటి వాటిని అధిగమిస్తే.. పరిమితులు పవన్ పరిధిని నియంత్రించవు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం.. మిగిలిన రాజకీయ నేతలకు పవన్ కు మధ్య వ్యత్యాసం పెద్దగా ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News