క‌న్ఫ్యూజ‌న్ తో చంపేస్తున్నావుగా ప‌వ‌న్‌?

Update: 2018-11-07 05:34 GMT
ప‌వ‌న్ పేరుకు ముందు ప‌వ‌ర్ స్టార్ అన్న మాట‌ను త‌ర‌చూ వాడుతుంటారు. కానీ.. ఆ పేరు కంటే కూడా క‌న్ఫ్యూజ‌న్ మాష్టారు అని పెడితే స‌బ‌బుగా ఉంటుందేమో. రాజ‌కీయ నేత అన్న త‌ర్వాత ఒక క్లియ‌ర్ విజ‌న్ ఉండాలి. ఒక స‌మూహం ఉత్సాహంతో అరుపులు వేసినంత‌నే త‌న అభిప్రాయాల్ని.. త‌న వ్యూహాల్ని మార్చుకోకూడ‌దు. కానీ.. ప‌వ‌న్ అలా లేరు. ఎక్క‌డికి వెళితే అక్క‌డి వాడన్నట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం మానేసి.. జీవించేస్తున్న తీరు పార్టీకి త‌ల‌నొప్పిగా మారింద‌న్న మాట వినిపిస్తోంది.

ఎక్క‌డికి వెళితే అక్క‌డ తాను పోటీ చేయాల‌ని అడిగే అభిమానుల‌ను సంతృప్తి ప‌రిచే క్ర‌మంలో ఆయ‌న భారీ క‌న్ఫ్యూజ‌న్ కు గురి అవుతున్నాయి. తొలుత తిరుప‌తి నుంచి పోటీకి దిగే ఛాన్స్ ఉన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న కొద్ది కాలానికే దాన్ని అనంత‌పురం నుంచే అన్న‌ట్లు క‌న్ఫ‌ర్మ్ చేశారు. అనంత‌పురం అర్బ‌న్ నుంచి పోటీకి దిగే ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌న్న విష‌యంపైన పార్టీ ప్ర‌త్యేక అధ్య‌య‌నం నిర్వ‌హించింది కూడా.

ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా ఆ మ‌ధ్య‌న ఇచ్చాపురంలో పోటీ చేసే అంశాన్ని ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌.. తాజాగా పిఠాపురం పేరును తెర మీద‌కు తీసుకొచ్చారు. ఒక పార్టీ అధినేత‌ను త‌మ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌మ‌ని ప‌లువురు అడ‌గ‌టం మామూలే. అంత మాత్రానికే తాను పోటీ చేసే స్థానంపై భిన్నాభిప్రాయాలు వ‌చ్చేలా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం స‌రికాదు. కానీ.. ప‌వ‌న్ మాత్రం ఈ విష‌యాల్ని గుర్తించ‌కుండా అదే ప‌నిగా తాను బ‌రిలోకి దిగే నియోజ‌క‌వ‌ర్గంపై సంబంధం లేని రీతిలో ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం క‌నిపించ‌క మాన‌దు. 

ఒక పార్టీ అధినేత ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాలి?  దానికి కార‌ణం ఏమిటి?  వ్యూహం ఏమిటి? అన్న దానికి సంబంధించి ప‌క్కా లెక్క‌లు ఉంటాయి. అంతేకానీ.. ఎక్కడికి వెళితే అక్క‌డ.. దేవుడు ద‌య‌త‌లిస్తే మీ ప్రాంతం నుంచి పోటీ చేస్తానంటూ చెప్ప‌టం స‌రికాదు. ఈ విష‌యంలో ఇప్ప‌టికే ప‌వ‌న్ ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. తాజాగా పిఠాపురం నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌న్న‌ట్లుగా ప‌వ‌న్ చెప్పిన మాట‌ల‌తో కొత్త క‌న్ఫ్యూజ‌న్ తెర మీద‌కు రావ‌టం ఖాయం. 

భారీ ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నేత ఎవ‌రైనా బ‌రిలోకి దిగుతామంటే ఎవ‌రు మాత్రం కాదంటారు. అయితే.. తాను బ‌రిలోకి దిగే చోటు పార్టీకి ప్ర‌యోజ‌నంగా మార‌ట‌మే కాదు.. త‌న‌కు కంచుకోట‌గా నిల‌వాల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అదేమీ లేకుండా ఒక స‌మూహం అరుపులు.. కేక‌లు వేసినంత‌నే టెంప్ట్ కావ‌టం స‌రి కాదు. ఈ విష‌యాన్ని బ్యాలెన్స్ చేసుకునే విష‌యంలో ప‌వ‌న్ ఇబ్బందికి గురి అవుతున్నారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఎక్క‌డికి వెళితే అక్క‌డ‌.. దేవుడు ద‌య త‌లిస్తే స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ చెప్పే తీరు ఆయ‌న రాజ‌కీయ ప‌రిణితి మీద కొత్త అనుమానాలు క‌లిగిస్తున్నాయి. తాజాగా ఆయ‌న చేప‌ట్టిన జ‌న‌సేన ప్ర‌జాపోరాట యాత్ర‌లో భాగంగా పిఠాపురానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌సంగించిన ప‌వ‌న్‌.. అభిమానులంతా సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్న వేళ ప‌వ‌న్ స్పందించారు.

మీ అరుపులే మంత్రాలై.. శ్రీ‌పాద వ‌ల్ల‌భుడి ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిని చేస్తారేమో? అన్న మాట‌ను చెప్పారు. అయితే.. సీఎం.. సీఎం అంటూ అభిమానులు ఇస్తున్న నినాదాల‌పై ప‌వ‌న్ స్పందించారు. ఈ రోజు అరుస్తాం.. వెళ్లిపోతామ‌ని.. అది స‌రికాద‌న్నారు. ఆలోచ‌న ద‌హిస్తుంది.. అంబేడ్క‌ర్ మాదిరి జ్వ‌లిస్గేనే మార్పులు వ‌స్తాయ‌న్నారు. ఇదిలా ఉంటే.. తాను ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌న్న‌ది పార్టీ సెల‌క్ష‌న్ క‌మిటీ ఎంపిక చేస్తుంద‌న్నారు. కామెడీ కాకుంటే.. ఒక పార్టీ అధినేత ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌న్న విష‌యాన్ని పార్టీ సెల‌క్ష‌న్ క‌మిటీ నిర్ణ‌యించే సీన్ దేశ రాజ‌కీయాల్లో ఉందంటారా?
Tags:    

Similar News