బాబు వ‌ల్ల ప‌వ‌న్‌ కు క‌ష్టాలు

Update: 2016-02-29 06:30 GMT
పవన్‌ కల్యాణ్...జ‌న‌సేన అదినేత‌, ప‌వ‌ర్ స్టార్. సినీ అభిమానుల్లో టాప్‌ లో ఉన్న‌ట్లే ప్ర‌జ‌ల్లోనూ పాపులారిటీ ఉన్న నాయ‌కుడు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజ‌యంలో ప‌వ‌న్‌ ది కీల‌క‌పాత్ర‌. అయితే టీడీపీ ఓటేయమని కోరినందుకు ఇప్పుడు ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు చేసే మంచి, చెడుల్లో సగం పవన్‌ మోయాల్సి వస్తోందంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ లో  ఫార్టీ పిరాయింపుల ఎపిసోడ్‌ లో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది.

టీడీపీ తరపున గెలిచిన స‌నత్ న‌గ‌ర్ ఎమ్మెల్యే తలసాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్‌ టీఆర్ ఎస్‌ లో చేరి మంత్రి అవడంపై ప‌వ‌న్‌ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అని నిల‌దీశారు. పార్టీ మారావు సరే సనత్ నగర్‌ ప్రజల నమ్మకానికి తెచ్చుకోగలవా అని తలసానిని పవన్ సూటిగా ప్రశ్నించారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడం తప్పే కాబ‌ట్టి పవన్ అలా ప్రశ్నించడంలో అభ్యంత‌రం ఏమీలేదు. అయితే ఇపుడు చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. ఈ ఎపిసోడ్‌ పై పవన్ ప్రశ్నించకపోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

తెలంగాణలో ఫిరాయింపులను తప్పుపట్టిన పవన్‌ సొంత రాష్ట్రం ఏపీలో అదే రాజకీయం నడుస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదనే సందేహాలు ఎదుర‌వుతున్నాయి. పవన్ నిజాయితీపరుడైతే అయిష్టంగానైనా ప్రెస్ మీట్ పెట్టి బాబు చర్యను ఖండించాల్సింది. కానీ అది జరగలేదని గుర్తుచేస్తున్నారు. కనీసం ఆయన ట్విట్టర్ వేదికగా కూడా స్పందించడంలేదని తేల్చేస్తున్నారు. పరోక్షంగా చంద్రబాబు పాపపుణ్యాల్లో పవన్ కూడా వాటా తీసుకుంటున్నట్టుగా ఉందని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇంత‌కీ ప‌వ‌న్ ఈ ప్ర‌శ్న‌ల‌పై ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.
Tags:    

Similar News