అవును నిజం..నిజం..గ్రూపులున్నది నిజం!

Update: 2018-11-14 18:20 GMT
ఇంకా పుట్టని పసిపాపకు పేరు - స్కూల్లో సీటు - కాలేజీలో ర్యాంకులు ఊహించడం ఎంత హాస్యాస్పదమో... ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్న జనసేన పార్టీలో గ్రూపు రాజకీయాలు వెల్లు వెత్తడం అంతే వాస్తవం. పవనిజం పేరుతో పవర్ స్టార్ - జనసేనాని పవన్ కల్యాణ్ నేటి రాజకీయ పార్టీలకు అతీతంగా తమ పార్టీ ఉంటుందని ప్రకటించారు. అయితే ఇతర రాజకీయ పార్టీలకు జనసేనకు ఏమాత్రం తేడా లేదని పవన్ కల్యాణ్ అభిమానులు - నాయకులు నిరూపిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణే అంగీకరించడం.

జనసేన పార్టీలో కొందరు గ్రూపులు కడుతున్నారని, దీని వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలుసుకోలేనంత అవివేకిని కాదంటూ పవన్ కల్యాణ్ ప్రకటించడం పార్టీలో గ్రూపులు ఉన్నాయన్న వాదానికి బలాన్ని చేకూరుస్తోంది. ఇతర పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీ విలక్షణమైనది అని - తమ రాజకీయాలు కూడా ఇతర పార్టీల ఉండవని పవన్ కల్యాణ్ పదే పదే ప్రకటిస్తుంటారు. అయితే వాస్తవాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం గమనార్హం.

ఈ గ్రూపు రాజకీయాలపై పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాను యువతీ - యువకులు - ఆడపడచులు - అన్నదమ్ముల కోసం రాజకీయాలలోకి వచ్చానని - తన పార్టీలో ఇలాంటి గ్రూపు రాజకీయాలకు తాను వెరవనని - పవన్ చెప్తున్నారు. అయితే వాస్తవాలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తనను అభిమానించే ప్రజలకు - పార్టీకి మధ్య పార్టీ కార్యకర్తలు - నాయకులు ఉంటారని - వారే అటు పార్టీకి - ఇటు ప్రజలకు మధ్య సంధాన కర్తలని అంటున్నారు. ఈ అంశాలపై సరైన అవగాహన లేని జనసేనాని పవన్ కల్యాణ్ అంతా తానేనని భ్రమించడం ఆయన అమాయకత్వమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ పార్టీ అంటే గ్రూపులు మయమేనని - వీటి నుంచి పార్టీని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలి తప్ప మరో మార్గం లేదని వారంటున్నారు. పవన్ మాత్రం ఇందుకు విరుద్దంగా అన్నీ తానే అని వ్యవహరించాలని అనుకోవడం పార్టీకి మేలు చేయదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News