ఏం జేస్తివి ప‌వ‌న్ క‌ల్యాణ‌..1

Update: 2015-08-24 12:58 GMT
ట్విట్ట‌ర్ పిట్ట‌తో ట్వీట్ల కూత పెట్టిన జ‌న‌సేన అధినేత జ‌నంలోకి రావ‌టం వెళ్ల‌టం జ‌రిగిపోయాయి. స‌మ‌కాలీన రాజ‌కీయ నాయ‌కుల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే ఆయ‌న‌.. ఆహార్యం విష‌యంలో కూడా ఎప్పుడు ఎలా ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తారో అర్థం కాని తీరులో ఉంటారు. పార్టీ పెట్టే స‌మ‌యంలో గోధుమ రంగు లాల్చీ.. గ‌డ్డంతో చెల‌రేగిపోయిన ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత ఒక్కోసారి ఒక్కోలా క‌నిపించారు.

తాజాగా ఏపీ రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. రాజ‌కీయ నాయ‌కుడి మాదిరి కాకుండా సినిమా హీరోలా ఆయ‌న స్టైలింగ్ ఉంది. క్లీన్ షేవ్ తో.. ట‌క్ చేసి.. వృదాప్య త‌ల్లిదండ్రుల‌కు అక్క‌ర‌కు వ‌చ్చిన పెద్ద‌కొడుకు మాదిరి సూటు లేకున్నా బూటేసుకొని వ‌చ్చి.. ఇంట్లో పిల్లాడిలా అంద‌రి మ‌ధ్య‌కు చేరి స‌మ‌స్య‌లు విన్నాడు.

చూసేందుకు కాస్తంత కొత్త‌గా ఉన్నా.. ప‌వ‌న్ గురించి తెలిసిన వారికి మాత్రం ఆయ‌న పాత‌గానే క‌నిపించారు. జ‌నం మ‌ధ్య‌లో కూర్చొని మాట్లాడుతున్న‌ప్పుడు.. ఓ రైతు త‌న తువ్వాలు ఇస్తే.. కాస్తంత మాసిపోయిన దాంతోనే ఎలాంటి భేష‌జం లేకుండా ముఖం తుడుచుకొని ఇచ్చేశాడు. అది కూడా చాలా మామూలుగా... షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న‌కు అందించే బ్రాండెడ్ తువ్వాలు మాదిరే.

ఇలాంటివి ప‌వ‌న్ ను ఆరాధించే వారు ఆయ‌న ఎలాంటి మ‌నిషి అన్న‌ది చెప్పేందుకు స‌రిపోతాయ‌ని చెబుతుంటారు. ఇక‌.. ఆయ‌న్ని విమ‌ర్శించే వారు మాత్రం తెర మీదే కాదు..నిజ జీవితంలో కూడా బాగానే న‌టిస్తున్నాడే..  అంటూ తిట్టేస్తారు. రాజ‌ధానిలో భూములు ఇవ్వ‌మ‌ని చెబుతున్న రైతుల్ని పరామ‌ర్శించేందుకు.. వారికి అండ‌గా నిలిచేందుకు.. వారికి స‌రికొత్త ధీమా ఇచ్చేందుకు ప‌వ‌న్ త‌న తాజా యాత్ర గురించి చెప్పుకున్నారు. మ‌రి.. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌తో ఆ ల‌క్ష్యం నెర‌వేరిందా? అస‌లు.. ఆయ‌న ప‌రామ‌ర్శ‌కు ఇది స‌రైన స‌మ‌య‌మా? లాంటి ప్ర‌శ్న‌ల వెలువ‌డుతున్న వేళ‌.. ప‌వ‌న్ వైఖ‌రిని.. భావోద్వేగాల‌కు అతీతంగా.. నిర్మాణాత్మ‌కంగా ప‌రిశీలిస్తే..!

రాజ‌ధాని కోసం భూములు ఇవ్వ‌మ‌ని చెబుతూ.. చావ‌నైనా చ‌స్తాం కానీ..భూములు ఇచ్చేది మాత్రం లేదంటున్న రైతుల్ని క‌లిసిన సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే స‌మ‌యంలో తాను రెండు అంశాల్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించాన‌ని.. అందులో రాజ‌ధాని నిర్మాణం ఒక‌ట‌న్నారు. త‌న ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబిచ్చే స‌మ‌యంలో చంద్ర‌బాబు.. ఒక్క ఎక‌రాను కూడా రైతుల నుంచి సేక‌రించ‌కుండానే అద్భుతంగా రాజ‌ధాని నిర్మాణం చేయొచ్చ‌ని.. కొన్నిప్ర‌భుత్వ‌.. అట‌వీ భూముల‌ను డీ నోటిఫై చేయ‌టం ద్వారా రాజ‌ధానికి భూమి ఇబ్బందులు లేవ‌ని.. కృష్ణా జిల్లాలో అలాంటి అవ‌కాశం ఉంద‌ని చెప్పార‌న్నారు.

తాను చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాల్ని వ‌రుస‌గా చెప్పే అల‌వాటు లేని ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యాల్ని..ముక్క‌లు.. ముక్క‌లుగా చెబుతుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న మాట‌ల‌కు లింకు కూడా ఉండ‌దు. స‌డ‌న్ గా ఒక విష‌యంలో నుంచి మ‌రో విష‌యానికి వెళ్లిపోతుంటారు. నిన్న‌టి ప్ర‌సంగాన్నే చూస్తే.. త‌న ట్వీట్ల‌పై య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చేసిన వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌.. దాన్ని పూర్తి చేయ‌కుండానే.. మ‌రో అంశంలోకి వెళ్లిపోవ‌టం దీనికో నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

ఇక‌.. ప‌వ‌న్ ప్ర‌సంగంలో రెండు విష‌యాల్ని ప్ర‌స్తావించారు. అందులో ఒక‌టి..  తాను ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌ద్ధ‌తు ఇచ్చినా.. అధికారంలోకి వ‌చ్చాక‌.. ప్ర‌భుత్వ విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌టం.. స‌ల‌హాలు ఇవ్వ‌టం లాంటివి చేయ‌న‌ని. ఎందుకంటే రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ‌ల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించాల్సిన మ‌ర్యాద‌.. గౌర‌వాన్నికాపాడేందుకు తాను ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తాన‌ని.. అందుకే ప్ర‌భుత్వ నిర్ణ‌యాల్ని ఏ ద‌శ‌లోనూ జోక్యం చేసుకోలేద‌న్నారు. అదే స‌మ‌యంలో త‌న‌కు అడ‌గ‌కుండా స‌ల‌హాలు ఇచ్చే అల‌వాటు లేద‌ని.. త‌నింట్లో కొడుక్కి సైతం అడ‌గ‌కుండా ఎలాంటి స‌ల‌హాలు ఇవ్వ‌న‌ని.. అలాంటిది ఎవ‌రూ అడ‌గ‌కుండానే స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఎందుకిస్తాన‌ని వ్యాఖ్యానించారు.

ఇలాంటి మాట‌లు చెప్పిన ప‌వ‌న్ ను చూస్తే ఎన్నో సందేహాలు క‌లుగుతాయి. అందులో ప్ర‌ధాన‌మైంది ఇప్ప‌టిదాకా మౌనంగా ఉన్న ఆయ‌న ఇప్పుడు తెర‌పైకి ఎందుకు వ‌చ్చిన‌ట్లు అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. ఇప్పుడొచ్చి ఆయ‌న చేసిందేమీ లేదు.. గోడ మీద పిల్లి వాటంలా నిలవ‌టం త‌ప్ప అన్న విమ‌ర్శ మూట‌గట్టుకున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో స‌మ‌స్య ఎక్క‌డ వ‌స్తుందంటే.. తాను రాజ‌కీయ నాయ‌కుడ్ని కాద‌ని.. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పే ఆయ‌న‌.. అటు పూర్తి స్థాయి రాజ‌కీయ నేత‌లా ఉండ‌లేక‌.. అలా అని త‌న క‌ళ్ల ముందు జ‌రిగే వాటిని ప్ర‌శ్నించ‌కుండా ఉండలేరు. అయితే.. ఈ విష‌యాల్లో ఆయ‌న మ‌దిలో జ‌రిగే ఆంత‌ర్మ‌ధ‌నం.. ఆచితూచి అడుగులు వేయాల‌న్న ఆలోచ‌న‌తో పాటు.. తొంద‌ర‌పాటు ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌ని.. హుందాగా ఉండాల‌న్న ఎన్నో అంశాలు ఆయ‌న్ని స‌రైన స‌మ‌యంలో సూటిగా ప్ర‌శ్నించ‌కుండా ఆపేస్తుంటాయా? అనిపించ‌క మాన‌దు.

ఎందుకంటే.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌న‌తో మట్లాడిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు.. ఒక్క ఎక‌రా కూడా రైతుల నుంచి తీసుకోకుండా ప్ర‌భుత్వ భూముల‌తోనే నిర్మిస్తాన‌ని చెప్పి.. 30వేల ఎక‌రాల‌కు పైనే భూస‌మీక‌ర‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడే ప‌వ‌న్  ప్ర‌శ్నించాల్సింది. అదేంటి చంద్ర‌బాబు.. ఎక‌రం కూడా అవ‌స‌రం లేద‌ని 30వేల ఎక‌రాలు ఎందుకు అడుగుతున్నావ్ అని ప్ర‌శ్నించి.. అప్పుడే క‌నుక తెర‌పైకి వ‌చ్చి.. ఎన్నిక‌ల స‌మయంలో త‌న‌కు చెప్పిన మాట గురించి.. ఆదివారం చెప్పిన‌ట్లుగా చెబితే ప‌వ‌న్ ను ఎవ‌రూ వంక పెట్టే వారు కాదు.

అదొక్క‌టే కాదు.. రాజ‌ధాని విష‌యంలో త‌న‌కు చెప్పిన దానికి భిన్నంగా వెళుతున్న బాబు వైఖ‌రితోపాటు.. భూస‌మీక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి మీద ఆయ‌న ఫీడ్ బ్యాక్ సేక‌రించి ఉంటే.. పెనుమాక‌లో రైతులు చెప్పిన విష‌యాల్ని ఆశ్చ‌ర్యంగా వినాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేది కాదేమో.

భూసేక‌ర‌ణ సంద‌ర్భంగా రైతుల‌తో ప్ర‌భుత్వం చేసుకుంటున్న ఒప్పందాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన సందేహాల్ని.. బాబు త‌ర్వాత వ‌చ్చే ప్ర‌భుత్వ వైఖ‌రిపై వారికున్న అనుమానాల్ని ప్ర‌స్తావించిన‌ప్పుడు జాగ్ర‌త్త‌గా విన్నారు. కొన్నిసార్లు ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లు క‌నిపించింది కూడా.  భూస‌మీక‌ర‌ణ మీద సాదాసీదా రైతులు వెలుబుచ్చిన సందేహాల‌కు ప‌వ‌న్ లాంటి వ్య‌క్తి ఆశ్చ‌ర్య‌పోవ‌టం ఏమిటి? రాజ‌ధాని లాంటి అత్యంత కీల‌క అంశం మీదా.. వేలాది ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసే అంశాల మీద ప‌వ‌న్ స‌మ‌గ్రంగా ఎందుకు క‌స‌ర‌త్తు చేయ‌లేదు. ప్ర‌పంచంలో జ‌రిగే ప‌రిణామాల మీద త‌న‌తో ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చించేందుకు వీలుగా కొంత‌మంది మ‌నుషుల్ని జీతానికి పెట్టుకొని మ‌రీ న‌డిపించార‌ని చెప్పుకుంటుంటారు. అలాంటి  ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌ధాని విష‌యంలో ఏపీ స‌ర్కారు వ్య‌వ‌హార‌శైలి మీదా.. ప్ర‌భుత్వ విధానాల గురించి స‌మ‌గ్రంగా ప‌రిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఉండి ఉంటే.. ఈ రోజు ఆయ‌న విమ‌ర్శ‌ల వ‌ర్షంలో త‌డిచేవారు కాదు.
Tags:    

Similar News