మళ్లీ ఓదార్పు యాత్ర...ఈసారి జగన్ కాదు...?

Update: 2022-04-02 13:30 GMT
ఓదార్పు యాత్ర అంటే జగన్ పేరే చెప్పాల్సి ఉంటుంది. అసలు ఓదార్పు పేరుతో యాత్ర చేస్తారా అని ఆశ్చర్యంతో కళ్లు విప్పార్చి చూసేవారికి. మెదళ్లలో సమాధానం రాక అలా పలుకురాక  ఉండిపోయేవారికి అలా కూడా చేయవచ్చు అని ఆచరణలో చూపించిన వాడు జగన్. జగన్ తొలినాళ్ళ రాజకీయానికి ఓదార్పు యాత్ర బలమైన పునాది వేసింది. పార్టీ  జెండా అజెండా ఏమీ లేకుండా కేవలం తండ్రి వైఎస్సార్ మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను జగన్ పరామర్సించారు, ఓదార్చారు.

అలా నాడు జగన్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇది జరిగి పుష్కర కాలం కావస్తోంది. ఆ తరువాత జగన్ ఎన్నో యాత్రలు చేశారు, చివరగా పాదయాత్ర చేసి మరీ ఏపీలో అధికారాన్ని అందుకున్నారు. అయితే ఇపుడు మళ్లీ ఏపీలో ఓదార్పు యాత్ర మాట వినిపిస్తోంది. ఈసారి ఓదార్పు యాత్ర చేసేది జగన్ కాదు, పవన్. అవును జనసేనాని పవన్ ఈ యాత్రకు సిద్ధపడుతున్నారు.

ఆయన ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఓదార్చే పేరిట పెద్ద కార్యక్రమాన్నే చేపడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, తమను ఆదుకునే వారు లేక సాగు చేయడం దండుగ అని భావించి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలని పవన్ ఓదార్చనున్నారు. అదే విధంగా కౌలుకు భూములు తీసుకుని నానా అవస్థలు పడుతూ ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల దాకా ఆర్ధిక సాయం కూడా చేయనున్నారు. నిజానికి ఇలా చేయడం వల్ల రైతులకు భరోసా వస్తుంది. వెంటనే ఎంతో కొంత ఆర్ధిక సాయం అందుతుంది. ప్రభుత్వానికి కూడా హెచ్చరికగా ఉంటుంది. మొత్తానికి జనసేనాని అన్నీ ఆలోచించే జనంలోకి వస్తున్నారు.

ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉభయ గోదావరి జిల్లాలోనే 75 మంది దాకా ఉంటే ఏపీ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారని జనసేన నేతలు అంటున్నారు. వారిని అందరినీ పవన్ పలకరించబోతున్నారు. అంతే కాదు, ఏపీలో పెద్ద ఎత్తున ఉన్న రైతు సోదరులను ఆదుకుంటామని చెప్పబోతున్నారు.

పవన్ చేసే ఓదార్పు యాత్ర త్వరలో స్టార్ట్ కాబోతోంది. పవన్ పార్టీ పెట్టాక ఈ తరహా యాత్రలను షురూ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్న వేళ సమాజంలో అత్యంత ప్రభావిత రంగంగా ఉన్న రైతులకు ఆసరాగా ఉంటూ పవన్ చేసే ఓదార్పు యాత్ర జనసేన రాజకీయానికి మేలి మలుపుగా ఉంటుందని అంటున్నారు.
Tags:    

Similar News