సీఎంను గుర్తించ‌డ‌ట‌ - మంత్రి మండ‌లి నిర్ణ‌యం కావాల‌ట‌!

Update: 2019-12-22 06:53 GMT
ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ అహం బాగా దెబ్బ  తిని ఉండ‌వ‌చ్చు.. అందుకే ఆయ‌న కుల‌ - మ‌త రాజ‌కీయాల పేరుతో విద్వేషాల‌ను పెంచ‌డానికి కూడా వెనుకాడ‌క‌పోతూ ఉండ‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ కులాలు - మ‌తాల మ‌ధ్య‌న చిచ్చు పెట్టేలా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలో చాలా మంది ఆ రాజ‌కీయాన్ని అస‌హ్యించుకున్నారు కూడా. జ‌న‌సేన పార్టీకి కొన్ని రాజీనామాలు కూడా చోటు చేసుకున్నాయి.

ఇలాంటి నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాలిటిక్స్ కు మ‌రిన్ని ఎదురుదెబ్బ‌లు కూడా త‌గ‌ల‌క త‌ప్ప‌డం లేదు. ప్ర‌ధానంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ లో సీఎం జ‌గ‌న్ ప‌ట్ల తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంది. అదెందుకో తెలియ‌దు కానీ, జ‌గ‌న్ ను త‌ను సీఎంగా గుర్తించ‌నంటూ ప్రేలాపించాడు ప‌వ‌న్ క‌ల్యాణ్. దాని వ‌ల్ల త‌న అహంభావాన్ని ఆయ‌న చాటుకోవ‌డ‌మే కానీ, మ‌రో ప్ర‌యోజ‌నం లేదు!

ఇక అన్నింటి క‌న్నా కామెడీ ఏమిటంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా విడుద‌ల చేసిన  ప్ర‌క‌ట‌న‌. ఆ ప్ర‌క‌ట‌న సారాంశం ఏమిటంటే.. మూడు రాజ‌ధానులు విష‌యంలో జ‌న‌సేన పార్టీ ఇప్పుడే స్పందించ‌డ‌ట‌. ఈ విష‌యంలో మంత్రి మండ‌లి నిర్ణ‌యం వెలువ‌డ్డాకా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందిస్తార‌ట‌.

ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌తిరేకించారు. దానికి సంబంధించి అనేక ట్వీట్ల‌ను కూడా పెట్టారు. ఆ త‌ర్వాత తన పార్టీ త‌ర‌ఫున ఏదో క‌మిటీని వేసిన‌ట్టుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించుకున్నారు. ఇప్పుడేమో రాజ‌ధాని విష‌యంలో మంత్రి మండ‌లి నిర్ణ‌యం వ‌చ్చిన త‌ర్వాత త‌మ స్పంద‌న ఉంటుందంటూ ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

ఇలా ర‌క‌ర‌కాలుగా మాట్లాడ‌టం ఒక కామెడీ అయితే, ఇది వ‌ర‌కూ త‌ను ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గుర్తించేదే లేదంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ఇప్పుడేమో మంత్రి మండ‌లి నిర్ణ‌యం వ‌చ్చాకా స్పందిస్తార‌ట‌!

ముఖ్య‌మంత్రి త‌న అభిప్రాయాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో మంత్రిమండ‌లి అందుకు ఆమోదం తెల‌ప‌డ‌మే త‌ప్ప‌.. మ‌రో ముచ్చ‌టే ఉండ‌దు. ముఖ్య‌మంత్రినే గుర్తించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్, ఇలా మంత్రి మండ‌లి నిర్ణ‌యం త‌ర్వాత స్పందిస్తామంటూ చెప్పుకోవ‌డం మ‌రో ప్ర‌హ‌స‌నం!
Tags:    

Similar News