నా ఇంటికి ఐటీ అధికారుల్ని పంపించారు-పవన్

Update: 2018-03-07 09:48 GMT
కేంద్ర ప్రభుత్వం విషయంలో ఇన్నాళ్లూ సుతి మెత్తగా విమర్శలు చేస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్వరం పెంచాడు. కేంద్రంపై కొంచెం గట్టిగానే విమర్శలు గుప్పించాడు. కేంద్ర ప్రభుత్వం తన ఇంటికి కూడా ఐటీ అధికారులను పంపడం ద్వారా బెదిరించే ప్రయత్నం చేసినట్లు పవన్ వెల్లడించాడు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలూ చిల్లరగా ప్రవర్తిస్తున్నాయని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. తాను థర్డ్ ఫ్రంట్ కు ఎందుకు మద్దతిచ్చానో కూడా పవన్ వివరించాడు. తాజాగా ప్రెస్ మీట్లో పవన్ ఏం మాట్లాడాడంటే..

‘‘నేను థర్డ్ ఫ్రంట్ కు మద్దతు ఇచ్చింది అధికారం కోసమే అని అందరూ అనుకుంటున్నారు. కానీ దీన్ని కోరుకున్నది రాజకీయాల్లో మార్పు కోసం. స్వతంత్రంగా వ్యవహరించడానికి థర్డ్ ఫ్రంట్ అవసరం. థర్డ్ ఫ్రంట్‌లోకి దక్షిణాది నుంచి అన్ని రాష్ట్రాలు కలిసి రావాలి. ఇంకా కాంగ్రెస్.. బీజేపీలను వ్యతిరేకించే పార్టీలు ముందుకు రావాలి. దక్షిణాది నుంచే కాకుండా ఉత్తరాది నుంచి జిజ్ఞేష్ మేవాని వంటి వారు కూడా కలిసి వస్తారు. తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరగాలి. ప్రత్యేక హోదాపై బాధ్యతతో వ్యవహరించాల్సిన పార్టీలు చిల్లరగా ప్రవర్తిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుంది. ప్రజల భాగస్వామ్యం లేకుండా పార్టీలు ఉద్యమిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నా ఇంటికి కూడా ఐటీ అధికారులను పంపించి బెదరగొట్టే ప్రయత్నం చేసింది. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం జేఏసీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని చంద్రబాబు ప్రభుత్వం అంటోంది.. ఐతే ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పనందుకే నిధులు నిలిపేశామని కేంద్రం అంటోంది.. మరి ఇందులో ఏది నిజమో తెలియాలి’’ అని పవన్ అన్నాడు.

Tags:    

Similar News