అభిమాని అత్యుత్సాహం.. కిందపడిన పవన్ కల్యాణ్

Update: 2022-02-21 02:30 GMT
అభిమానానికి భీకర శత్రువు అత్యుత్సాహం. అభిమానం పేరుతో కొందరు చేసే చేష్టలు తాము అమితంగా ఆరాధించే వారికి ఎన్ని తిప్పలు తెచ్చి పెడతాయో.. తాజా పరిణామాన్ని చూస్తే అర్థమవుతుంది. అదే సమయంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భద్రత విషయంలో మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయనకు అపాయం ఎంత దగ్గరగా ఉందన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అధినేతలకు కొదవ లేదు. కానీ.. వీరందరికి మించిన అభిమానం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంతం.

అది తెలంగాణ కావొచ్చు.. ఆంధ్రా కావొచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడకు వెళ్లినా సరే.. పవన్ కల్యాణ్ ను చూడటం కోసం ఆయన మాటల్ని వినేందుకు జనాలు విరగబడతారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సైతం ఏదైనా బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తే.. అందుకోసం భారీ ఎత్తున కసరత్తు చేయాలి. పెద్ద ఎత్తున ప్లాన్ చేయాలి.

అందుకోసం ఖర్చు కూడా బాగానే అవుతుంది. కానీ.. పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ఆయన వస్తున్నారన్న మాట తెలిసినంతనే వేలాది మంది ఆయన అభిమానులు రోడ్ల మీదకు వచ్చేస్తారు. తమ అభిమాన నటుడు కమ్ నాయకుడ్ని చూసేందుకు విరగబడతారు.

పవన్ కున్న ఫ్యాన్ బేస్ ఎంతన్న విషయం మరోసారి రుజువైంది. ఆయన నరసాపురం వెళ్లే క్రమంలో దారి మధ్యలో కారు ఆపారు. ఆయన్ను చూసేందుకు వేలాది మంది చుట్టూ చేరిన నేపథ్యంలో వారికి అభివాదం చేసేందుకు ఆయన కారు టాప్ మీదకు ఎక్కారు. దీంతో అక్కడున్న వేలాది మంది పవన్ ను చూసి కేరింతలు కొట్టారు. ఇదే సమయంలో.. అనూహ్యంగా ఒక అభిమాని పవన్ వాహనం మీదకు ఎక్కడ.. ఆయనకు దగ్గరగా రావటం.. ఆ వేగానికి పవన్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. పవన్ తో పాటు.. ఆ అభిమాని కింద పడ్డారు.

అయితే.. ఇది జరిగిన ఐదారు సెకన్ల లోపే మళ్లీ లేచిన పవన్..ప్రజలందరికిఅభిమానం చేశారు. ఈ అనూహ్య పరిణామంతో ఆయనకు భద్రత కల్పిస్తున్న వారు ఒక్కసారిగా అవాక్కు అయ్యారు. ఈ ఉదంతం చేసే హెచ్చరిక ఏమిటంటే.. అభిమాని కాబట్టి సరిపోయింది. అదే ఏ సంఘ విద్రోహ శక్తి అయితే పరిస్థితి ఏమిటి? ఎందుకైనా మంచిది తన భద్రతకు సంబంధించిన అంశాల్ని తాజా ఉదంతం నేపథ్యంలో మరోసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం పవన్ మీద ఉంది. ఆయన ఎంత త్వరగా ఆ పని చేస్తే అంత మంచిదన్న మాట పలువరి నోట వినిపిస్తోంది.


Tags:    

Similar News