అండ‌గా నిలిచి గెలిపించింది ఇందుకా బాబు?

Update: 2018-05-16 05:26 GMT
ప్ర‌స్తుతం గుళ్లు.. గోపురాలు తిరుగుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. తాజాగా చిత్తూరులో జ‌రుగుతున్న రోడ్ల విస్త‌ర‌ణ ప‌నుల్ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా బాబు స‌ర్కారుపై తీవ్రంగా మండిప‌డ్డారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు పర్య‌టిస్తూ.. ప్ర‌భుత్వ విధానాల్ని త‌ప్పు ప‌డుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

అభివృద్ధి అంటే భార‌తీయుల భూముల్ని లాక్కుని విదేశీయుల‌కు అప్ప‌గించ‌ట‌మా? అంటూ సూటిగా ప్ర‌శ్నించిన ప‌వ‌న్‌.. వేలాది కోట్ల రూపాయిల్ని విదేశీ కంపెనీల‌కు దోచి పెడుతున్నారంటూ మండిప‌డ్డారు. దీని కోస‌మేనా.. తాను కాపు కాచి మ‌రి తెలుగుదేశం పార్టీని సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలిపించింది? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

పేద‌ల భూముల్ని లాక్కుని పెద్ద‌ల‌కు ధారాద‌త్తం చేయ‌టం స‌రికాదంటూ బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప‌వ‌న్ తాను అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు వ్య‌తిరేకం కాద‌న్నారు.

ప‌రిహారం ఇవ్వ‌కుండా బ‌ల‌వంతంగా భూముల్ని ఎలా లాక్కుంటార‌ని నిల‌దీసిన ప‌వ‌న్‌.. కేంద్ర‌మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విజ‌య‌న‌గ‌రం నుంచి నంద్యాల‌.. శ్రీ‌కాళ‌హ‌స్తి వ‌ర‌కూ అభివృద్ధి కార్య‌క్ర‌మాల పేరు చెప్పి భూములు తీసుకొని ప‌రిహారం ఇచ్చార‌న్నారు. కానీ.. ఇదే విధానం చిత్తూరుకు ఎందుకు వ‌ర్తించ‌దు? అని సూటిగా ప్ర‌శ్నించారు.

చిత్తూరులోని గిరింపేట‌లో దాదాపు మూడు కిలోమీట‌ర్ల మేర రోడ్ షోను నిర్వ‌హించిన ప‌వ‌న్‌.. బాబుపై సెంటిమెంట్ వ్యాఖ్య‌లు చేశారు. సొంత జిల్లా వాసుల‌ని కూడా చూడ‌కుండా చంద్ర‌బాబు ఇక్క‌డ ప్ర‌జ‌ల క‌డుపులు కొట్టి ఏం సాధిస్తార‌ని సూటిగా ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఎక్క‌డైనా భూముల్ని లాక్కుంటే చూస్తూ ఊరుకోమ‌న్న ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. బాబు అడ్డాలోకి వెళ్లి మ‌రీ.. ఆయ‌న‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం.. సొంత ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తున్న బాబులోని కోణాన్ని బ‌య‌ట‌పెట్ట‌టం తెలుగుత‌మ్ముళ్లు కిందామీదా ప‌డుతున్నారు.
Tags:    

Similar News