బాబూ... నంద్యాల‌లో ప‌వ‌న్ పంచ్‌ కు రెడీనా?

Update: 2017-07-01 07:00 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప‌వ‌ర్ చూప‌నున్నారా? ప‌వ‌న్ వ‌ల్లే గ‌త ఎన్నిక‌ల్లో తాము గెల‌వ‌లేద‌ని, ఆయ‌న మ‌ద్ద‌తుతో త‌మ‌కు ఒరిగిందేమీ గంభీరంగా ప‌లికిన తెలుగుదేశం ప్ర‌జాప్ర‌తినిధులు - నాయ‌కుల‌కు గ‌ట్టి షాకే ఇవ్వ‌నున్నారా? అంటు అవున‌నే మాట వినిపిస్తోంది. క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నికలో ఈ ట్విస్ట్ ఖాయ‌మ‌ని వినిపిస్తోంది. దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్యం అయింది. దాదాపు మూడేళ్ల త‌ర్వాత వ‌స్తున్న ఎన్నిక కావ‌డంతో అధికార టీడీపీ - విప‌క్ష వైసీపీకి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారాయి. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ త‌న మార్కు ఏ విధంగా చూపుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

వైసీపీ త‌ర‌ఫున గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో గెలిచిన భూమా... ఆ త‌ర్వాత టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇప్పుడు భూమా వార‌సుడిగా రాజ‌కీయ తెరంగేట్రం చేస్తున్న భూమా అన్న కొడుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిపోయారు. ఇక నాడు టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి వైసీపీ అభ్య‌ర్థి చేతిలో ప‌రాజ‌యం పాలైన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి ఇప్పుడు వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే నాడు పోటీ చేసిన అభ్య‌ర్థులు ఇప్పుడు నాటి త‌మ పార్టీల‌కు వైరి వ‌ర్గాలు దిగేశార‌న్న మాట‌. నాటి ప‌ట్టును మ‌రోమారు రుజువు చేసుకోవ‌డమే కాకుండా... అధికార పార్టీకి కాస్తంత గ‌ట్టిగానే బుద్ధి చెప్పేందుకు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే ముందుకు సాగుతున్నారు. ఇక అధికార పార్టీగా త‌న అభ్య‌ర్థిని గెలిపించుకునేందుకు టీడీపీ కూడా నానా పాట్లు ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. మొత్తం నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్ల‌లో మెజారిటీ షేర్ ఉన్న నంద్యాల ప‌ట్ట‌ణంలో మెజారిటీ కౌన్సిల‌ర్లు వైసీపీ త‌ర‌ఫున నిల‌వ‌డంతో...  ఆ పార్టీ అభ్య‌ర్థి శిల్పాకే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే భూమా సానుభూతి - అభివృద్ధి నిధుల వ‌ర‌ద పారించి ఎలాగైనా విజయం సాధించాల్సిందేన‌న్న కోణంలో చంద్ర‌బాబు కూడా ప‌క్కాగానే ప‌థ‌కం వేశారు.

ఈ క్ర‌మంలో ఇప్పుడు... మొత్తం ఆ ఉప ఎన్నిక‌నే ప్ర‌భావితం చేయ‌నున్న ఓ అంశం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆధ్వ‌ర్యంలోని జ‌నసేన పార్టీ త‌న మ‌ద్ద‌తును వైసీపీకి ప్ర‌క‌టించిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లు నంద్యాల‌లో అధికంగా ఉన్న నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తు అంశం ఇప్పుడు అక్క‌డ కీల‌కంగా మారింది. జ‌న‌సేన మ‌ద్ద‌తుతో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అయినా... మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికిన ప‌వ‌న్ క‌ల్యాణ్... ఇప్పుడు ఉన్న‌ట్టుండి వైసీపీకి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం వెనుక ఓ పెద్ద క‌థే ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

రాష్ట్రంలోని రోజుకో స‌మ‌స్య పుట్టుకొస్తున్నా... అధికార టీడీపీ వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో పాటు త‌న‌దైన దుందుడుకు వైఖ‌రితో ముందుకు సాగుతోంద‌న్న వాద‌న లేద‌పోలేదు. అంతేకాకుండా ఆయా వ‌ర్గాల విన‌తుల‌ను చంద్ర‌బాబు స‌ర్కారు ఏమాత్రం పట్టించుకోవ‌డం లేద‌ని కూడా సంబంధిత వ‌ర్గాలు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్టిన చంద్ర‌బాబు... కేంద్రం వ‌ద్ద మోక‌రిల్ల‌డ‌మే కాకుండా త‌న‌కు అనుకూలంగా ఉన్న వారికి ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు ప్రాధాన్య‌మిస్తున్నార‌ని, ఈ క్ర‌మంలోనే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అట‌కెక్కింద‌న్న‌ది మెజారిటీ ప్ర‌జ‌ల వాద‌న‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇదే వాద‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు, అమ‌రావ‌తిలో బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ వంటి అంశాల్లోనూ ప్ర‌భుత్వ వైఖ‌రిని ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఇక ఆక్వా ఫుడ్ పార్క్ ప‌రిస్థితి స‌రేస‌రి. వీటిపై ఓ పెద్ద పోరాట‌మే చేసిన ప‌వ‌న్... ఇప్పుడు సైలెంట్ గా ఉన్న‌ప్ప‌టికీ... త‌న మాట‌ను లెక్క‌చేయ‌ని అధికార పార్టీకి ఓ ఝ‌ల‌క్ ఇచ్చి తీరాల్సిందేన‌ని భావించార‌ట‌.

ఈ క్ర‌మంలోనే నంద్యాల ఉప బ‌రిలో వైసీపీకి మ‌ద్ద‌తిచ్చి అధికార‌ పార్టీకి ఓ గుణ‌పాఠం నేర్పాల‌న్నది ప‌వ‌న్ యోచ‌న‌గా చెబుతున్నారు. అయితే ఈ త‌ర‌హా వైఖ‌రి నంద్యాల ఉప ఎన్నిక‌ల వ‌ర‌కేన‌ని, రానున్న ఎన్నిక‌ల్లో పాత వైఖ‌రితోనే ప‌వ‌న్ ముందుకెళ‌తార‌ని తెలుస్తోంది. త‌న మాట‌ను గౌర‌వించ‌ని, ప్ర‌జ‌ల ఇబ్బందుల‌పై శీత‌క‌న్నేసిన అధికార పార్టీకి... త‌న‌తో పాటు జ‌నం కూడా ఎదురు తిరిగితే ఫ‌లితం ఎలాగుంటుందో చూపేందుకే ప‌వ‌న్ నంద్యాల ఉప బ‌రి ప్ర‌ణాళిక ర‌చించుకున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇదే జ‌రిగితే... నంద్యాల బై పోల్స్‌లో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌ లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం త‌న అభిమానులు, పార్టీ నేత‌ల‌తో గ‌త రెండు రోజులుగా స‌మావేశం అవుతున్న ప‌వ‌న్ ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చే విష‌య‌మై క్లారిటీ ఇవ్వ‌లేద‌ట‌. అంతేకాకుండా టీడీపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయాల‌ని ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించిన కొంద‌రు నేత‌ల‌ను సైతం నిలువ‌రించార‌ట‌. దీంతో ప‌వ‌న్ స్టెప్ ఎలా ఉంటుంద‌నే టెన్ష‌న్ అధికార పార్టీలో మొద‌ల‌యిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి.  ఇంత‌కీ ప‌వ‌న్ మ‌దిలో ఏముందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News