మాటిమాటికీ ఈ బ్రేకులేంది ప‌వ‌న్?

Update: 2018-06-04 07:50 GMT
రాజ‌కీయాల్లో ఏ ప‌ని చేసినా పక్కా ప్ర‌ణాళిక‌తో చేయాలి. ముఖ్యంగా రాజ‌కీయ నేత‌లు పాద‌యాత్ర‌ల వంటివి చేయాల‌నుకున్న‌పుడు ఒక రూట్ మ్యాప్.....ప‌ర్య‌ట‌న తేదీలు, విరామాలు వంటివాటిని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అంతేగానీ, హ‌ఠాత్తుగా ముంద‌స్తు స‌మాచారం లేకుండా ప‌ర్య‌ట‌న‌ల‌లో రెస్ట్ తీసుకోవ‌డం వ‌ల్ల దాని సీరియ‌స్ నెస్ పోతుంది. ప్ర‌స్తుతం జ‌న‌సేనాని ప‌వ‌న్ చేస్తోన్న ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప‌లాస‌లో ఒక రోజు దీక్ష‌...ఒక రోజు రెస్ట్ తీసుకున్న ప‌వ‌న్ తాజాగా మ‌రోరోజు సెల‌వు పెట్టారు. ఆదివారం నాడు ప‌వ‌న్ ప‌ర్య‌ట‌నలో ఆట‌విడుపు ప్ర‌ద‌ర్శించారు. అయితే, ఆదివారం నాడు ప‌వ‌న్ రెస్ట్ పై ముంద‌స్తు స‌మాచారం లేక‌పోవ‌డంతో ప‌ర్య‌ట‌న ఉంటుందో లేదో తెలియ‌క అభిమానులు - కార్య‌క‌ర్త‌లు గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. ప‌ర్య‌ట‌న లేని విష‌యాన్ని ముందు వెల్ల‌డించ‌క‌పోవ‌డం వ‌ల్ల వార ఇబ్బందిప‌డ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

విజయనగరం జిల్లా పర్యటన అన‌తరం ప‌వ‌న్ శ‌నివారం రాత్రి ముగించుకుని అరకులోయ చేరుకున్నారు. అయితే, ప‌వ‌న్ ఆదివారం పూర్తిగా రిసార్టుకే పరిమితం అయ్యారు. పవన్ పర్యటనపై ముంద‌స్తు సమాచారం లేకపోవడంతో ప‌వ‌న్ బ‌స‌చేసిన రిసార్ట్ ద‌గ్గ‌ర‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు. అయితే, ఆదివారం ఉద‌యం రిసార్ట్స్ ఆవరణలో మార్నింగ్ వాక్ చేసిన త‌ర్వాత ప‌వ‌న్ అభిమానులు, ప‌ర్యాట‌కులు, కార్య‌కర్త‌ల‌తో మాట్లాడి అరగంట తర్వాత తన గదికి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత విశాఖ జిల్లాలోని జనసేన ప్రతినిధులు - మన్యంలోని అభిమానులతో రిసార్ట్స్‌లో ప‌వ‌న్ సమావేశమ‌య్యారు. ఆ స‌మావేశంలో స్థానిక సమస్యలు, పర్యటన రూపకల్పన తదితర విషయాలు చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, పవన్ ను చూసేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిమానులు రిసార్ట్స్ వద్ద పోటెత్తారు. అయితే, ప‌వ‌న్ వ్యక్తిగత భద్రత సిబ్బంది వారిని అనుమ‌తించ‌క‌పోవ‌డంతో నిరాశ‌గా వెనుదిరిగారు. మ‌రోవైపు, సోమవారంనాడు సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న నేప‌థ్యంలోనే పవన్‌ టూర్‌ షెడ్యూల్ మారింద‌ని టాక్.

మొద‌టి నుంచి ప‌వ‌న్ యాత్ర పై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. హ‌ఠాత్తుగా పోరాట యాత్ర‌ను ప్రారంభించిన ప‌వ‌న్..త‌న‌కు తోచిన‌పుడు బ్రేక్ లు తీసుకుంటున్నారు. ఒక వైపు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ...గ‌త 6 నెల‌ల నుంచి అలుపెర‌గ‌కుండా పాదయాత్ర చేస్తోంటే...ప‌వ‌న్ మాత్రం నెల తిరిగే లోపే 3 రోజులు బ్రేక్ తీసుకున్నారు. అందులోనూ ప‌వ‌న్ చేస్తోంది పూర్తిగా పాద‌యాత్ర కూడా కాదాయే. మొన్నటికి మొన్న దీక్ష‌పేరుతో ఒక రోజు...భ‌ద్ర‌తా సిబ్బంది లేర‌ని ఒక‌రోజు....నిన్న వీకెండ్ పేరుతో ఒక రోజు....ఇలా స్కూల్ పిల్ల‌లు బ‌డి ఎగ్గొట్టేందుకు సెల‌వులు పెడుతున్న‌ట్లు ప‌వ‌న్ తన యాత్ర‌కు బ్రేకులివ్వ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిన్నపాటి యాత్రకే ప‌వ‌న్ అల‌సిపోతే...భ‌విష్య‌త్తులో ప‌వ‌న్ నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా పాద‌యాత్ర‌ల వంటి వాటిని ఆశించ‌లేమేమోన‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఇక‌పై నైనా ప‌వ‌న్ ...తన యాత్ర‌ను నిర్విరామంగా కొన‌సాగిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News