అనంత‌లో స‌భ తోనే ప‌వ‌న్ ఆగిపోవ‌ట్లేదు

Update: 2016-11-04 15:32 GMT
జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజ‌కీయంగా కీల‌క అడుగులు వేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో జనసేన సభ ఉన్న నేప‌థ్యంలో జ‌న‌సేనాని అభిమానులు అంతా ఈ స‌భ‌పై ఉత్సాహంతో ఉండ‌గా..ప‌వ‌న్ త‌ర‌ఫు నుంచి ఇంకో ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. 10వ తేదీ స‌భ త‌ర్వాత గుత్తిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముచ్చటించనున్నారు. ఈ కాలేజీ మీటింగ్‌ పై వివిధ వ‌ర్గాలు అంచ‌నాలు వేసిన నేప‌థ్యంలో ఇంజినీరింగ్ కళాశాల అధినేత సుధీర్ రెడ్డి స్పందించారు.

ఇటీవల ప‌వ‌న్‌ను క‌లిసేందుకు హైదరాబాద్‌ కు వెళ్లిన స‌మ‌యంలో అనంత‌పురం జిల్లాలో నెలకొన్న‌ కరువు పరిస్థితిని, గుంతకల్లు నియోజకవర్గంలోని స్థితిగ‌తుల‌ను వివరించినట్లు సుధీర్ రెడ్డి చెప్పారు. గుత్తికి రావాలని పవన్‌ ను ఆహ్వానించగా...దానికి మ‌న్నించిన ప‌వ‌న్ త‌మ కాలేజీకి వ‌స్తున్నార‌ని తెలిపారు. అంతే త‌ప్ప‌ పవన్ కళ్యాణ్  త‌మ కాలేజీకి హాజరు కావడంలో ఎలాంటి రాజకీయం లేదని  వివ‌రించారు. మ‌రోవైపు ప‌వ‌న్ బహిరంగ సభకు అభిమానులు పెద్ద ఎత్తున‌ ఏర్పాట్లు చేస్తున్నారు. పదో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న సభలో వేదిక నుంచి పవన్ మాట్లాడుతారు. ఈ సంద‌ర్భంగా  ప్రత్యేక హోదా, అనంత కరువు, సాగు, తాగునీరు తదితర అంశాలపై స్పందిస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News