'పాపం పసివాడు' మూవీ పోస్టర్ తో జగన్ కు పవన్ భారీ ట్వీట్ పంచ్

Update: 2023-05-17 10:57 GMT
బాపట్ల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ రియాక్టు అయ్యారు. తాజాగా ట్వీట్ తో పంచ్ వేశారు. జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేయటం తెలిసిందే. ఎప్పటిలానే ఆయన నోటి నుంచి 'క్లాస్ వార్' మాట రావటంపై పవన్ తీవ్రంగా ఆక్షేపించారు. ముఖ్యమంత్రి జగన్ కు క్లాస్ వార్ పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా లేదన్నారు.

అదే సమయంలో ఎప్పుడూ లేని రీతిలో.. అప్పట్లో సూపర్ హిట్ అయిన.. ''పాపం పసివాడు'' సినిమా పోస్టర్ ను తన ట్వీట్ కు జత చేసిన పవన్.. ''ఏపీ ముఖ్యమంత్రితో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని ఆశిస్తున్నాం.

సీఎం జగన్ చాలా అమాయుడు. కాకుంటే ఆ సినిమాలో చిన్న మార్పు అవసరం. సినిమా పోస్టర్ లో పిల్లాడి చేతిలో సూట్ కేస్ కు బదులుగా.. నాలుగైదు సూట్ కేసులు కంపెనీలు ఉంచాలి'' అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి.. పాతతరం నేతలైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య.. కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి తరహా నాయకుడు కాదన్నారు. ''అక్రమ సంపాదనతో.. ప్రజల మీద మీరు సాగిస్తున్న హింసతో వర్గ యుద్ధం (క్లాస్ వార్) పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా సీఎంకు లేదు. ఏదో ఒక రోజు రాయలసీమ మీ నుంచి.. మీ గుంపు బారి నుంచి విముక్తి అవుతుందని ఆశిస్తున్నా'' అని ట్వీట్ లో పేర్కొన్నారు.

ట్వీట్ చివర్లో కొసమెరుపుగా.. ''ఈ సినిమాకు రాజస్థాన్ ఎడాది ఇసుక దిబ్బలు కావాలి. కానీ వైసీపీ ఏపీలోని నదీ తీరాల నుంచి దోచుకుంది. కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు' అంటూ ఎద్దేవా చేశారు. పాపం పసివాడుపోస్టర్ తో పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Similar News