దేశ‌భ‌క్తిపై ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర...

Update: 2016-12-17 12:33 GMT
కేంద్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్లో ప్రశ్నల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. అంశాల వారీగా తాను స్పందిస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే గోవధ - హెచ్‌ సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య గురించి ప్ర‌స్తావించి త‌నదైన శైలిలో ప్ర‌శ్న‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా దేశభక్తి గురించి ప‌వ‌న్ సూటిగా నిల‌దీశారు. దేశభక్తికి సంబంధించి ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉంటాయ‌ని పేర్కొంటూ ఆయా పార్టీల విధానాల ఆధారంగా దేశభక్తిని అంచనా వేయవద్దని సూచించారు.

జాతి-కుల-మత-వర్గ- ప్రాంతీయ‌-భాషా భేదాలకు అతీతంగా వ్యవహరించడమే నిజమైన దేశభక్తి అని ప‌వ‌న్ విశ్లేషించారు. అంతేత‌ప్ప అధికారంలోని పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడినంత మాత్రాన దేశభక్తి లేనట్టు కాదని పేర్కొంటూ విలువలతో కూడిన మానవ సంబంధాలే దేశభక్తికి నిజమైన అర్థమని పవన్ క‌ళ్యాణ్ స్పష్టంచేశారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల సుప్రీంకోర్టు విడుద‌ల చేసిన ఆదేశాల ఆధారంగా కూడా కేంద్ర ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ మండిప‌డ్డారు. కుటుంబం - స్నేహితులతో కలిసి సినిమా చూడటం దేశభక్తికి పరీక్షా వేదికగా కావొద్దని ప‌వ‌న్ సూచించారు. రాజకీయ పార్టీలు సమావేశాలను జాతీయ గీతాలాపనతో ఎందుకు ప్రారంభించవని ప్రశ్నించారు. చట్టాలను చేసేవారు, వాటి గురించి ప్రచారం చేసేవారు.. వారెందుకు ఆచరించరు? ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలవొచ్చు కదా.. అని పవన్ సూటిగా ప్రశ్నించారు. ఈ సంద‌ర్భంగా పార్టీల‌న్నింటిపై ప‌వ‌న్ సెటైర్ వేశారు. ప్ర‌స్తుత పరిస్థితులు చూస్తే అమెరికన్‌ ఆర్థికవేత్త థామస్‌ సొవెల్‌ మాటలు గుర్తొస్తున్నాయని పవన్‌ పేర్కొన్నారు.

మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా అంశంపై రేపు ట్వీట్‌ చేయనున్నట్టు పవన్‌ వెల్లడించారు. వ‌రుస క్ర‌మంలో అంశాల వారీగా లోతైన విశ్లేష‌ణ‌తో చేస్తున్న ట్వీట్లు ఆయా వ‌ర్గాల్లో వ‌ణుకు పుట్టిస్తున్నాయ‌ని ప‌లువురు అంటున్నారు. ప్ర‌త్యేక హోదాపై ప‌వ‌న్ చేయ‌బోయే ట్వీట్ ఆధారంగా ఆయ‌న రాజ‌కీయ అడుగుల‌ను అంచ‌నా వేయ‌వ‌చ్చ‌ని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News