పవన్ మార్క్ ప్రతిపక్షం... ?

Update: 2021-10-29 09:57 GMT
పవన్ కళ్యాణ్ రాజకీయంగా పరిణతి సాధిస్తున్నారు. ఆయన రాజమండ్రి టూర్ తరువాత ఆ సంగతి అందరికీ అర్ధమైంది. పవన్ ఇదివరకు మాదిరిగా ఆవేశంగా మాట్లాడకుండా ఆలోచనతో కూడిన ప్రసంగాలు చేస్తున్నారు. ఇక ఆయన తనకంటూ ఉన్న బలమైన సామాజికవర్గానికి చేరువ కావాలనుకుంటున్నారు. ఇంతకాలం తనకు కులం లేదు అంటూ గొప్పగా చెప్పుకున్న మాటల వల్ల ఒరిగేది ఏదీ లేదని, రాజకీయం పక్కాగా చేయాలంటే ఆ లెక్కలు అన్నీ ఫాలో కావాల్సిందే అని పవన్ కి బోధపడడం అంటే జనసేనకు మంచి రోజులు వచ్చినట్లే అని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో కేవలం తాను ఒకే కులానికి పరిమితం కాకుండా మిగిలిన కులాలను ఆకట్టుకునేలా వ్యూహరచన చేస్తున్నారు.

ఇక పవన్ ఈ మధ్య వైసీపీ ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలలో కూడా పదును కనిపిస్తోంది. అదే సమయంలో తాను వ్యతిగత స్వార్ధంతోనో, కక్షతోనో వాటిని చేస్తున్నాను అన్న కలరింగ్ రాకుండా పవన్ జాగ్రత్తపడుతున్నారు. తాను ప్రజల కోసమే వారి సమస్యలనే ఎత్తుతున్నాను అని ఆయన తన నిలదీత ద్వారా చెప్పకనే చెబుతున్నారు. ఇంకో వైపు చూస్తే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గా ఉన్న తెలుగుదేశం మాత్రం ఢీ అంటీ ఢీ అంటూ పొలిటికల్ ఎడ్జి ని కూడా దాటేస్తోంది అన్న భావన అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది. దాని వల్లనే సీరియస్ గా టీడీపీ విమర్శలు చేసినా అవి జనాల్లోకి ఎక్కడంలేదు అంటున్నారు.

దాంతో పవన్ ఇదంతా గమనించి తన రూట్ మార్చుకున్నారు అంటున్నారు. దానికి సాక్ష్యం ఆయన ఈ మధ్యనే గంజాయి మీద చేసిన విమర్శలు, నిజానికి గంజాయి అంశాన్ని పట్టుకునే కదా టీడీపీ పట్టాభి ద్వారా ఎంతో యాగీ చేసింది. అది చివరికి ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి దాకా వెళ్లింది. ఇప్పటికీ ఆ వేడి అలా కంటిన్యూ అవుతోంది. ఇలా అసలు విషయం వెళ్లి కొసరు విషయాలు వెలుగులోకి వచ్చేశాయి. పవన్ అయితే మాత్రం గంజాయి మీద వరసబెట్టి ట్వీట్లు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. దాని వల్ల వచ్చే సమస్యలను ఆయన చాలా చక్కగా జనాలకు అర్ధమయ్యేలా చెబుతున్నారు.

గంజాయి సమస్య ఈనాటికి కాదు అని పవన్ అనడంలోనే ఆయన మార్క్ పాలిటిక్స్ ఉందని చెప్పాలి. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది, 2018 నుంచే తాను విశాఖ లో గంజాయి అంశం మీద ప్రస్థావిస్తూ వస్తున్నాను అని చెప్పారు. ఆ విధంగా ఆయన మాట్లాడం ద్వారా గంజాయి విషయంలో ఆరోపణలు చేసే టీడీపీకి నైతిక హక్కు లేదన్నట్లుగా వ్యవహరించారు. ఇక పవన్ ప్రభుత్వానికి కూడా నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం పటిష్టమైన చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఏపీలో గంజాయిని తుదముట్టించాలని కూడా సలహా ఇస్తున్నారు. అదే విధంగా ఈ అంశాన్ని సామాజిక ఆర్ధిక సమస్యగా చూడాలని, గిరి ప్రాంతానికి చెందిన యువత ఈ ఉచ్చులో చిక్కుకోకుండా వారికి వేరే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా కోరుతున్నారు. మొత్తానికి పవన్ సడెన్ గా గంజాయి ఇష్యూ ఎత్తడంతో తమకు మంచి బూస్టింగ్ వచ్చిందని టీడీపీ తమ్ముళ్ళు సంతోషించే లోపే ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారు. తాను సిసలైన ప్రజా పక్షంగా వ్యవహరిస్తాను అంటున్నారు. ఈ విధంగా కనుక పవన్ దూకుడు చేస్తే ఏపీలో ఆయనే అసలైన ప్రతిపక్ష నేతగా మారుతారు అనడంతో సందేహం లేదు అంటున్నారు.
Tags:    

Similar News