పవనన్నా... జర జోరు పెంచన్నా... ?

Update: 2021-12-26 01:30 GMT
పవన్ కళ్యాణ్ కి ఎవరికీ లేని అదృష్టం ఉంది. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా అరవై కోట్ల షేర్ డెడ్ ఈజీగా వస్తుంది. అదే రాజకీయాల్లో రెండు చోట్లా ఓడినా కూడా క్యాడర్ అనబడే వీర లెవెల్ ఫ్యాన్స్ ఆయన్ని వదలి ఎక్కడికీ వెళ్ళారు. రాజకీయంగా పవన్ ప్లేస్ లో మరో నాయకుడు ఉంటే ఏనాడో ఖేల్ ఖతం, దుకాణం బంద్ అయ్యేది. కానీ పవన్ మాత్రం ఈ రోజుకీ ఏపీలో ఒక ఫోర్స్ గా ఉన్నారు.

అంతే కాదు, వీలున్నపుడల్లా సీఎం పోస్ట్ తో లింక్ పెట్టి మరీ పవన్ పేరు వినిపిస్తుంది మరి ఇంతకంటే సిరి ఉంటుందా. ఇక పవన్ ఒక సభ పెడితే చాలు నేల ఈనిందా అన్న రేంజిలో జనాలు వచ్చి పడతారు. మరి అది మిగిలిన రాజకీయ పార్టీల నేతలకు సాధ్యపడే విషయమా. బలమైన సామాజికవర్గం కూడా పవన్ వైపు ఆశగా చూస్తున్న సీన్ ఉంది.

ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా పొలిటికల్ గా సొమ్ము చేసుకోలేకపోవడం నిజంగా పవన్ విషయంలో బాధాకరమనే చెప్పాలి. ఆయన ఎవరితోనూ పొత్తు కట్టనక్కరలేదు, ఏపీ జనాలతో జట్టు కట్టి ముందుకు సాగితే చాలు, ఈ రోజు కాకపోతే రేపు అయినా కచ్చితంగా జనసేనదే అవుతుంది. కానీ పవన్ మాత్రం ఎన్నికలు ముగిసిన ఆరు నెలలు తిరగకుండానే బీజేపీతో బంధం పెనవేసుకున్నారు.

ఆ పార్టీతో పొత్తు వల్ల ఆయనకేమైనా అనుకూలమైందా అంటే ఏమీ లేదు. మోడీ సర్కార్ ఏపీలో అవలంబిస్తున్న అనేక వ్యతిరేక విధానాలను ఎలుగెత్తి విమర్శించలేని విధంగా పవన్ పార్టీ పరిస్థితి తయారైంది. ఏపీలో అనేక సమస్యలకు ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ అని అందరికీ తెలుసు. అయిదు కోట్ల ఆంధ్రులు బీజేపీ మీద గుర్రుగా ఉన్నారు.

ప్రత్యేక హోదాను మడచి పక్కన పెట్టేసిన బీజేపీ పోలవరం ప్రాజెక్టు విషయంలో అడుగడుగునా కొర్రీలు పెడుతుంది. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని నాడు చెప్పిన బీజేపీ పెద్దలు నేడు చేష్టలుడిగి చూస్తున్నారు. అమరావతి మన రాజధాని అని ఏపీ బీజేపీ అనడానికి రెండున్నరేళ్ల సమయం పట్టింది.

అయినా సరే జగన్ మూడు రాజధానుల విషయాన్ని అడ్డుకోవడంలో కేంద్ర పాలకులు ఎపుడూ శ్రద్ధ చూపించలేదు. వీటికి తోడు అన్నట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తున్నారు. అలాగే విశాఖ రీల్వే జోన్ లేనేలేదని తాపీగా చెబుతున్నారు. ఇలా ఏపీ ఫ్యూచర్ తో చెడుగుడు ఆడుతున్న బీజేపీతో అంటకాగుతున్న మూలంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక్క ముక్క వ్యతిరేకంగా అనలేని పరిస్థితి ఉంది.

ఆయన స్టీల్ ప్లాంట్ మీద అతి పెద్ద మీటింగ్ పెడితే లాభమేంటి అసలైన పాత్రధారులను వదిలేసి ఎంతసేపూ వైసీపీ మీద జగన్ మీద విరుచుకుపడుతున్నారు. దాంతో ఆ సభకు రావాల్సిన మైలేజ్ రావడంలేదు, ఇక మంగళగిరిలో దీక్ష చేసినా కూడా ఇదే సీన్. డిజిటల్ కాంపెయిన్ పేరిట హడావుడు చేసినా కూడా రావాల్సిన రెస్పాన్స్ రావడం లేదు అంటే తప్పు ఎక్కడ ఉందో పవన్ కి అర్ధమవుతోందా అన్నదే సొంత పార్టీలో ప్రశ్న.

బీజేపీని గట్టిగా నిలదీసి ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని చాటితే ఏపీ రాజకీయాల్లో పవన్ పార్టీ తారాజువ్వలా మీదకు దూసుకురాదా అనందే విశ్లేషకుల మాట కూడా. ఏపీలో పొలిటికల్ గా ఎంతో స్పేస్ ఉంది. టీడీపీని జనాలు చూసేశారు. బీజేపీ తీరుని కూడా ఎండగడుతున్నారు. అధికార వైసీపీ మీద వెల్లువలా వచ్చే ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోకుండా పవన్ పార్టీ ఎంతసేపూ జగన్ వ్యతిరేకతను నింపుకుని ముందుకు సాగడం వల్ల నో యూజ్ అనేస్తున్నారు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజల పక్షాన గట్టిగా నిలబడి కేంద్రం మీద దండెత్తితే చాలు ఆయనకు జనాలు నీరాజనాలు పడతారు, అదే విధంగా ఆయన ఏపీ సర్కార్ మీద పోరాడేందుకు సిద్ధపడాలి. అయితే పవన్ మాత్రం ఎందుకో పొత్తుల వైపు చూస్తున్నారు. మాజీ తాజా మిత్రుల మధ్య నలుగుతున్నారు అన్న కౌంటర్లు అయితే గట్టిగా పడుతున్నాయి. కానీ పవన్ రాజకీయం కోరుకునే వారు మాత్రం ఆన్నా జర జోరు పెంచరాదే అంటున్నారు.


Tags:    

Similar News