కామ్రేడ్స్ కు కొత్త ఐడియాలు ఇస్తున్న ప‌వ‌న్‌?

Update: 2018-03-26 10:34 GMT
ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉంది. కానీ.. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తే.. మ‌రో రెండు నెల‌ల్లో ఎన్నిక‌లు వ‌స్తుంటే వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో ఇంచుమించు అలాంటి ప‌రిస్థితి ఉంద‌ని చెప్పాలి. ఇప్ప‌టికే బీజేపీ..కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా కేసీఆర్ ఒక కొత్త త‌ర‌హారాజ‌కీయాన్ని తెర మీద‌కు తీసుకురావాల‌ని భావిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త‌తో కేసీఆర్ భేటీ అయ్యారు కూడా. అయితే.. కేసీఆర్ చెబుతున్న జాతీయ రాజ‌కీయాల‌కు జ‌ట్టుక‌ట్టే ప‌రిస్థితి లేద‌న్న‌మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ‌.. త‌న కంటూ జ‌ట్టులేని ప‌వ‌న్ క‌ల్యాణ్ నోట జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క ఫ్రంట్ ఒక‌టి ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంద‌న్న మాట వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

బీజేపీ.. కాంగ్రెస్ ప్ర‌త్యామ్నాయ కూట‌మి కోసం సాగుతున్న ప్ర‌య‌త్నాల్లో ప‌వ‌న్ కొత్త ఎత్తును తెర‌పైకి తెచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. త‌న‌కు ద‌గ్గ‌ర కావాల‌న్న ఆశ‌లో ఉన్న క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి.. జాతీయస్థాయిలో ఒక కొత్త జ‌ట్టు క‌డితే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని తాజాగా త‌న‌ను క‌లిసి కామ్రేడ్స్ తో చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు.. హోదాపై జ‌రుగుతున్న చ‌ర్చ గురించి చ‌ర్చించేందుకు ప‌వ‌న్ తో భేటీ అయ్యారు సీపీఎం మ‌ధు.. సీపీఐ రామ‌కృష్ణ‌. ఈ సంద‌ర్భంగా జాతీయ రాజ‌కీయాల‌కు సంబంధించి ప్ర‌త్యామ్నాయ ఫ్రంట్ ఆలోచ‌న‌ను ప‌వ‌న్ బ‌య‌ట‌పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ ల‌కు ప్ర‌త్యామ్నాయంగా మ‌న‌మే ఒక ఫ్రంట్ ఎందుకు ప్రారంభించ‌కూడ‌ద‌న్న మాట‌పై వామ‌ప‌క్షాల స్పంద‌న‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. మూడో కూట‌మి ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్య‌త తీసుకోవాల‌ని ప‌వ‌న్ చెప్పారంటున్నారు. భావ సారూప్య‌మున్న పార్టీల‌ను ఏకం చేసే బాధ్య‌త‌ను వామ‌ప‌క్షాల‌కు ఇస్తాన‌ని ప‌వ‌న్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.  దీనికి కామ్రేడ్స్ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేద‌ని చెబుతున్నారు. అయినా.. కూట‌మి గురించి మాట్లాడితే రాష్ట్ర స్థాయి నేత‌ల‌తో ప‌వ‌న్ మాట్లాడుడా?  ప‌వ‌న్ రాజ‌కీయ అవ‌గాహ‌న ఏమిటో.. తాజా ఎపిసోడే నిద‌ర్శ‌నమ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News