ఆ రూ.1000 కోట్లపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-03-13 10:47 GMT
మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలోని పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కాపు నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఒక ప్రముఖ దినపత్రిక...  బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. పవన్‌ కల్యాణ్‌ కు ఒక ఆఫర్‌ ఇచ్చారని.. బీఆర్‌ఎస్‌ తో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తే రూ.1000 కోట్ల ఆర్థిక సాయం చేస్తానని కేసీఆర్‌ అన్నారని ప్రముఖంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో పవన్‌ కల్యాణ్‌ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్యాకేజీ స్టార్‌ అంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ముఖ్య నేత, పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు సోషల్‌ మీడియాలో ఆ పత్రిక పేరు ఎత్తకుండా మండిపడ్డారు. అసత్య కథనాలు రాయడంపై ధ్వజమెత్తారు. మీడియా విలువలు కోల్పోతుందని.. ఆధారాలు లేకుండా రూమర్స్‌ ను ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు.

ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ఆ రూ.1000 కోట్ల ప్రచారంపై స్పందించారు. కాపు నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన పవన్‌ రూ.1000 కోట్లు ఉంటే పార్టీని నడపలేమని తెలిపారు. రూ.10 వేల కోట్లు ఉన్నా పార్టీని నడపడం అసాధ్యమన్నారు. డబ్బులు ఉంటే పార్టీలు నడుస్తాయని అనుకోవడం భ్రమ అని తేల్చిచెప్పారు. ఒక సిద్ధాంతం, భావజాలంతోనే పార్టీని నడపగలమని కుండబద్దలు కొట్టారు.

ఈ మధ్య రూ.1000 కోట్లు, రూ.1000 కోట్లు అని అంటుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. జనసేన పార్టీ భావజాలంతోనే నడుస్తోంది తప్ప డబ్బుతో కాదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

జనసేన పార్టీ ఎవరి జెండా, అజెండా కోసం పనిచేయదని పవన్‌ తేల్చిచెప్పారు. పార్టీ కోసం పనిచేసిన ఏ వ్యక్తి ఆత్మగౌరవాన్ని తాను తగ్గించనని తెలిపారు. అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని కాపులను కోరారు. వాస్తవిక దృక్పథంతో ఆలోచించే తాను నిర్ణయాలు తీసుకుంటానన్నారు. అంతేతప్ప అవమానపడో, గింజుకునో వేరే వారికి తానెందుకు మద్దతిస్తానని ప్రశ్నించారు.

కాపులు అధికారంలోకి వస్తే బీసీలను, దళితులను ఎదగనీయరనే దుష్ప్రచారాన్ని ప్రతి గ్రామంలోనూ తిప్పికొట్టాలని కాపులకు పవన్‌ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు.

మొత్తం మీద తనపై వచ్చిన రూ.1000 కోట్ల రూమర్లను పవన్‌ కల్యాణ్‌ తిప్పికొట్టారు. ఆరంభంలోనే ఈ గాసిప్స్‌ ను ఖండించారు. వాస్తవానికి ఆ పత్రిక కథనం తర్వాత జనసేన పార్టీ శ్రేణులు కూడా అయోమయానికి గురయ్యాయని అంటున్నారు.

దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ విస్తరించాలనుకుంటున్న క్రమంలో కేసీఆర్‌.. ఏపీలో పవన్‌ పై దృష్టి సారించారని.. బీఆర్‌ఎస్‌ తో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థుల ఖర్చు కింద రూ.1000 కోట్లు తాను పెట్టుకుంటానని పవన్‌ ఆఫర్‌ ఇచ్చినట్టు కథనాలు రావడంతో ముఖ్యంగా టీడీపీ ఉలిక్కిపడింది. అందులోనూ ఆ పత్రిక టీడీపీకి కొమ్ము కాసే పత్రికగా పేరు ఉండటం కూడా ఇందుకు కారణమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రూ.1000 కోట్ల వ్యవహారంపై వివరణ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ అదంతా ఉత్త గాలి వార్తలుగా తీసిపడేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News