హుజూరాబాద్ లో పెద్దిరెడ్డి.. బీజేపీలో చిచ్చు

Update: 2021-06-15 11:38 GMT
మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి. ఇప్పటికే బీజేపీలో ఉన్న ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడు ఈటల రాకతో ఆయన ప్రాతినిధ్యం కరువవుతోంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈటల బీజేపీలో చేరగానే.. రెండురోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించేందుకు పెద్దిరెడ్డి కార్యక్రమం రూపొందించుకోవడం బీజేపీలో చిచ్చు పెట్టింది. ఇటీవల కాలంలో కరోనాతో చనిపోయిన బీజేపీ నేతలు, కార్యకర్తల పరామర్శల పేరుతో క్యాడర్ ను కలిసేందుకు పెద్ది రెడ్డి నేడు, రేపు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బీజేపీ క్యాడర్ ను అంతా తనవైపు తిప్పుకునేలా.. ఈటలను దూరం పెట్టేలా ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. రేపు అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పర్యటన బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈటల రాజేందర్ కంటే ముందు రెండు సార్లు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పెద్ది రెడ్డి గెలిచాడు. ఈటల బీజేపీలో చేరితే మద్దతు ఇవ్వనని స్పష్టం చేశాడు. ఉప ఎన్నికల బరిలో ఉంటానని చెప్పిన పెద్దిరెడ్డి ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులను అంచనావేస్తూ ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.

ఈటల బీజేపీలో చేరికతో హుజూరాబాద్ సీటుపై ఆ పార్టీలో పీటముడి నెలకొంది. ఇప్పటికే ఆ సీటుపై కన్నేసిన పెద్దిరెడ్డి దీనిపై నిరాశలో ఉన్నాడు. బీజేపీ నేతలు ఎవరూ తనతో మాట్లాడలేదని అసహనం వ్యక్తం చేసిన పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

ఇక హుజూరాబాద్ లో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. దీంతో బరిలో దిగేందుకు అవకాశం కోసం పెద్దిరెడ్డి చూస్తున్నారు. బీజేపీ టికెట్ ఇవ్వకున్నా పోటీపై నియోజకవర్గ అనుచరులతో రాజకీయ భవిష్యత్ పై రేపు కీలక చర్చలు పెట్టారు. 15 రోజుల్లో కరీంనగర్ లో విలేకరుల సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.
Tags:    

Similar News