టైం తేడా వస్తే ఇలానే ఉంటుంది పెద్దిరెడ్డి.. సొంతోళ్ల షాక్ ఎంతంటే?

Update: 2022-12-11 06:30 GMT
టైం ఎవరిని వదలదు. ఎంతటి వారైనా సరే దాని ముందు తల వంచాల్సిందే. దానికి ఎవరూ అతీతం కాదు. ఈ విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. ఏపీ అధికారపక్షంలో జగన్ తర్వాత అత్యంత పవర్ ఫుల్ వ్యక్తులు ఇద్దరే ఇద్దరంటారు. వారిలో ఒకరు సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే మరొకరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఆయన హవా ఎంతన్న దానికి నిదర్శనంగా మరో మంత్రి ఆర్కే రోజాకు ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితుల్ని చెప్పొచ్చు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా తన మాటలతో విపక్షాలను ఉతికి ఆరేస్తుంటారు. అలాంటి ఆమెకు సైతం కంట్లో నీళ్లు తెప్పించే ఘనత పెద్దిరెడ్డి అండ్ కోకు మాత్రమే ఉందని చెబుతారు.

అలాంటి ఆయనకు సైతం చుక్కలు చూపించటం వైసీపీ నేతలకే చెల్లుతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న వర్గపోరే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. జిల్లాకు ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి ఉరవకొండలో వైసీపీ నియోజకవర్గ విస్త్రతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనికి పెద్దిరెడ్డి హాజరయ్యారు.  ఇదే మీటింగ్ కు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు.. ఆయన అన్న కమ్ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి మధ్య ఉన్న అధిపత్య పోరు గురించి తెలిసిందే.

పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉన్న ఆయన తాజా సమావేశానికి హాజరై.. ఉపన్యాసాలతో ఒరిగేదేమీ లేదని.. కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవటానికి సరైన ప్లానింగ్ లేకపోవటమే ఓడిపోవటానికి కారణమన్న ఆయన మాటలకు సమావేశానికి హాజరైన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈటలు.. చప్పట్లతో మద్దతు పలకటం కలకలం రేపింది. అదే సమయంలో ఆయన వ్యతిరేక వర్గమైన విశ్వేశ్వరరెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో విషయం చేజారి పోతుందన్న భావన కలిగింది.

ఆ సమయంలో మైకు తీసుకున్న మధుసూదన్ రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. మంత్రి పెద్దిరెడ్డి కలుగజేసుకొని చేతిలో మైకు తీసుకొని ఇద్దరినీ కూర్చోబెట్టారు. నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపులు లేవని.. తమది కేవలం ముఖ్యమంత్రి వర్గం మాత్రమే ఉందంటూ సర్దిచెప్పినా..

లోలోన లుకలుకలు మాత్రం ఇట్టే బయటపడ్డాయి. ఎవరినైనా తన కనుసైగతో.. నోటి మాటతో కట్టడి చేసే సత్తా ఉన్న పెద్దిరెడ్డి ముఖం చిన్నబోయేలా చేసిన సత్తా మాత్రం వైసీపీ నేతలదే అన్న మాట వినిపిస్తోంది. విపక్షాలకు వణుకు పుట్టించే పెద్దిరెడ్డి సొంతోళ్ల చేతిలో మాత్రం చిన్నబోయిన తీరు చూసినప్పుడు టైం అంటే ఇలానే ఉంటుందన్న భావన కలుగక మానదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News