వారి జీవనం ప్రత్యేకం... ప్రకృతితో మమేకం

Update: 2021-11-13 08:55 GMT
ఆ గ్రామం ప్రత్యేకం. ప్రకృతితో మమేకం. వారి జీవనశైలి అందరితో పోల్చితే కాస్తా భిన్నం. వారు నివసించే ఊరు ఈ కాంక్రీట్ జంగిల్ కు చాలా దూరం. కానీ వారీ జీవనం ఎంతో మందికి ఆదర్శం. అక్కడ అందరి మాట ఒక్కటే.. అందరి బాట ఒక్కటే... వారే కర్నూలు జిల్లా లోని బేతంచెర్ల రాధా స్వామి నగరికి చెందిన ప్రజలు.

వీరందరినీ ఏకం చేసింది రాధాస్వామి అనే ధార్మిక సంస్థ. ఇది ఉత్తరప్రదేశ్ కు చెందిన ధార్మిక సంస్థ. దీనికి గురువు గా వ్యవహరించే ప్రేమ్ శరన్ స్వామీజీ వీరందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. అందరిని ఒకే తాటి పైకి తీసుకొని వచ్చి వారికి వివిధ రకాల నైపుణ్యాలను అందించారు.

స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేలా చేశారు. గురువు ఆదేశానుసారం నడుచుకునే కుటుంబాలు ఇక్కడ మూడు వందలకు పైగా ఉన్నాయి. ఇక్కడ ఉండే ప్రజలు ఎవరూ పర్యావరణానికి హాని చేయరు. కనీసం వారిలో అలాంటి ఆలోచన కూడా ఉండదు. పర్యావరణాన్ని పాటు చేయకుండా ఉండేదుకు ఇంట్లో కనీసం ఏసీ కూడాఉండదు. ప్రకృతితో మమేకమై జీవిస్తున్న వీరు... కేవలం భూమి నుంచి వచ్చే మంచినీటిని మాత్రమే తీసుకుంటారు.

వీరు చేసే వ్యవసాయ పద్ధతులు కూడా పూర్తిగా సేంద్రియమైనవి. ఈ మూడు వందల కుటుంబాల్లో వ్యవసాయం చేసే వారు ఎవరూ కూడా రసాయన , పురుగుమందులను వాడరు. వాటికి చాలా దూరంగా ఉంటారు. ఆహార పదార్థాల్లో కూడా వీరు రసాయనాలు కలిసి ఉండే ఆహారం ఏమాత్రం తీసుకోరు. పండగలతో సంబంధం లేకుండా ఎప్పుడూ శాఖాహారానికి ప్రాధాన్యమిస్తారు. ఒక్కరంటే ఒక్కరు కూడా మద్యం, మాంసం అనేవి తీసుకోరు అంటే అతిశయోక్తి అనిపిస్తుంది.

ప్రత్యేకమైన జీవనవిధానాన్ని అనుసరించే వీరు తెల్లవారుజామున మూడున్నరకు నిద్రలేస్తారు. ఈ సమయం నుంచి ప్రతి ఒక్కరూ తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తారు. దీంతోనే వారి రోజు ప్రారంభం అవుతుంది. తర్వాతగా.. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తారు. ఇందులో కొందరు నడిస్తే, మరికొందు పరిగెత్తుతారు. ముసలివాళ్ళు లేక వయసు పైబడిన వాళ్లు వారి శరీరం సహకరించే దానిని బట్టి వ్యాయామం చేస్తారు. ఇవన్నీ గురువు ఆదేశాల ప్రకారం నడుచుకోవడంలో భాగంగా ఉంటుంది.

బేతంచర్ల లో వీరు చేసే వ్యవసాయం ఇతరులు చేసే దానికంటే భిన్నంగా ఉంటుంది. వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయాన్ని అవలంభిస్తారు. దీనిలో కొన్ని రకాల పండ్లను పండిస్తారు. ముఖ్యంగా ఆరోగ్యానికి మంచి చేసేటు వంటి సపోటా, సీతాఫలం లాంటి పండ్ల చెట్లను పెంచుతారు. కూరగాయలను కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో పండిన వాటినే వినియోగిస్తారు. ప్రతి ఒక్క కుటుంబానికి సరిపడా కూరగాయలు పంచుతారు. వ్యవసాయంలో వీరిది వెనకబాటుతనం అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే వీరు ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా లాభసాటి మార్గాల్లో వ్యవసాయం చేస్తున్నారు.

చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలు వీరు చేసే వ్యవసాయ విధానాలను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైనటువంటి పంటలను పండించి విక్రయించడం వల్ల మంచి లాభాలను పొందుతున్నారు. వీరిలో ఉండే సేవాగుణం కారణంగా ఏడాది ఒకసారి వీరు లాభాపేక్ష అనేది లేకుండానే పండించిన పంటలను విక్రయిస్తారు. ఈ గ్రామంలో ఉన్న మహిళల్లో ఎక్కువ మంది స్వయం ఉపాధి పనుల్లో పాల్గొంటారు. ఖాళీ సమయాల్లో చిరుతిండ్లను తయారుచేసి ఇందులో కూడా లాభాపేక్ష లేకుండా బయట వారికి విక్రయిస్తుంటారు. ఇలా వీరు సాగించే జీవనం మిగతా వారికి ఆదర్శవంతంగా నిలుస్తుంది.
Tags:    

Similar News