జగన్‌కు లోకేష్‌ వేసిన 17 ప్రశ్నలు ఇవే!

Update: 2022-05-17 03:35 GMT
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రంగంలోకి దిగేశారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే ప్రజలు ఆయన సభల నుంచి పరారవుతుండటంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా గణపవరంలో పర్యటించారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద అక్కడ నుంచే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సభ కోసం భారీ స్థాయిలో రైతులను, డ్వాక్రా మహిళలను వైఎస్సార్‌సీపీ నేతలు, అధికారులు తరలించారు.

అయితే సీఎం జగన్‌ ప్రసంగం మొదలు పెట్టారో, లేదో జనం పెద్ద సంఖ్యలో సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. పోలీసులు ఆపాలని చూసినా జనం మాత్రం ఆగలేదు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు సంధించారు.

రైతులను జగన్‌ దగా చేశారని.. జగన్‌ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని అనడానికి ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలని లోకేష్‌ నిలదీశారు. ఇందుకు సంబంధించి జగన్‌ సభ నుంచి జనం వెళ్లిపోతున్న వీడియోని లోకేష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. జగన్‌ది దరిద్రపు పాదమని లోకేష్‌ మండిపడ్డారు. జగన్‌ పాలనలో రైతు రాజ్యం సంగతి దేవుడెరుగు.. రైతు బ్రతికి ఉంటే అదే పది వేలు అనేలా పరిస్థితి ఉందని లోకేష్‌ అన్నారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చాకే జగన్‌ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు ‘ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పు.. జగన్‌ రెడ్డి’ అంటూ లోకేష్‌ పలు ప్రశ్నలను సంధించారు. అవి..

– అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించిన నీచుడెవరు?

– మూడేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క చిన్న కాలువనైనా తవ్వారా? ఒక్క చిన్న నీటి ప్రాజెక్టునైనా కట్టారా?

– రైతుల వద్ద గతేడాది కొన్న ధాన్యం డబ్బులు ఇచ్చారా?

– రూ.3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?

– ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎక్కడ?

–తుపాన్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఎంత ఇచ్చారు?

–పంటల బీమా కట్టమన్నారు. మరి రైతులకు ఇన్సూరెన్స్‌ వర్తించలేదెందుకు?

 – రూ.12500 రైతు భరోసా ఇస్తామని చెప్పి రూ.7500 మాత్రమే ఇస్తుంది ఎవరు?

– రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులని అసలు గుర్తించారా?

– వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్‌ ఇరిగేషన్, సూక్ష్మ పోషకాలు లాంటివి ఏమయ్యాయి?

– కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇచ్చిన మూర్ఖుడు ఎవరు?

– ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్‌ హాలిడేని మళ్లీ తీసుకొచ్చిన అసమర్థుడు ఎవరు?

– టీడీపీ హయాంలో రైతులకు రూ.3 లక్షల వరకు సున్నావడ్డీ నిబంధనలు కేవలం రూ.1 లక్షకే పరిమితం చేసింది ఎవరు?

– రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉండటానికి కారకుడు మీరు కాదా?

– ముదిగొండలో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన మీ నాన్నగారి రక్తచరిత్ర మర్చిపోయారా?

–సోంపేటలో రైతుల భూములు బలవంతంగా లాక్కొని థర్మల్‌ విద్యుత్‌ కంపెనీకి కట్టబెట్టి తద్వారా తమ భూముల రక్షణకు ఉద్యమం చేసిన రైతుల ప్రాణాలు కాల్పుల్లో పోవడానికి మూలకారణం మీ నాన్న రాజశేఖరరెడ్డి కాదా?

–రాజధాని కోసం భూములిచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తే టెర్రరిస్టుల్లా అమరావతి రైతులకి సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడి ఆదేశాలతో అంటూ నారా లోకేష్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పలు ప్రశ్నలు సంధించారు.


Full ViewFull View
Tags:    

Similar News