జగన్.. చిరు భేటీపై పేర్ని సంచలన వ్యాఖ్యలు.. ఎవరు చెప్పేది నిజం?

Update: 2022-01-22 05:26 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవిల భేటీ మారిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాల్ని చర్చించేందుకు వీలుగా చిరును లంచ్ కు సీఎం జగన్ పిలవటం.. ఆయన వెళ్లటం.. అప్పట్లో అందరిని ఆకర్షించింది. ఈ భేటీ అనంతరం.. చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లుగా వార్త రావటం.. అదంతా ఫేక్ న్యూస్ అని.. తనకు రాజకీయాలకు ఏ మాత్రం పొసగదని చిరు వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే.. తమ భేటీలో ఏమేం విషయాల్ని చర్చించామన్న విషయాన్ని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద చిరంజీవి మీడియాతో మాట్లాడటం తెలిసిందే. త్వరలోనే తీపికబురు వస్తుందని.. సీఎం జగన్ తో జరిగిన భేటీకి తాను చాలా సంతోషంగా ఉన్నానని.. త్వరలోనే మరోసారి భేటీ జరుగుతుందని.. ఆ సందర్భంలో ఇండస్ట్రీ నుంచి కొందరిని తీసుకెళతానని చెప్పటం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలప పరిష్కరానికి.. విదివిధానాలు ఖరారు చేసి తుది నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారన్నారు. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి ప్రయత్నాల్ని అభినందనీయమని పేర్కొన్నారు.

సీఎం జగన్ తో భేటీ అనంతరం చిరు చేసిన వ్యాఖ్యల తర్వాత.. ఇన్ని రోజులకు ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి - చిరంజీవిల మధ్య జరిగిన భేటీకి సంబంధించి మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి జగన్ - మెగాస్టార్ చిరంజీవిల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఒకవేళ చర్చలు జరిగితే ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఎందుకు మాట్లాడుతారని ప్రశ్నించారు. అందుకే.. చిరంజీవిని లంచ్ కు ఆహ్వానించారని.. ఇద్దరు కుశల ప్రశ్నలు మాత్రమే వేసుకున్నారని.. ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేయటం విశేషం. చర్చలు జరిగినట్లుగా చిరు చెప్పినప్పుడు మాట్లాడని నాని.. హటాత్తుగా ఈ వ్యాఖ్యలు చేయటం ఎందుకు? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఒకవేళ పేర్ని నాని చెప్పినట్లుగా చర్చలు జరగకుంటే.. చిరు చెప్పిన మాటలన్ని అబద్ధాలేనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. పేర్ని నాని వ్యాఖ్యలకు చిరు స్పందన ఏమిటో?
Tags:    

Similar News