జ‌న‌సేన రాజకీయ పార్టీ కాదు.. చంద్ర‌బాబు అనుకూల సంస్థ‌: మాజీ మంత్రి హాట్ కామెంట్స్‌!

Update: 2022-09-17 12:00 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శించ‌డం కోసం వైఎస్సార్సీపీ సిద్ధం చేసుకున్న నేత‌ల్లో పేర్ని నాని ఒక‌రు. కృష్ణా జిల్లా బంద‌రు ఎమ్మెల్యే అయిన పేర్ని నాని.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌ల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపుల‌ర్ అయ్యారు. ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీ గెలిచాక పేర్ని నాని క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ల‌భించింది. ర‌వాణా, పౌర‌సంబంధాల శాఖ మంత్రిగా జ‌గ‌న్ మొద‌టి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో పేర్ని నాని బెర్త్ కొట్టేశారు.

ఆ త‌ర్వాత కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై పేర్ని నాని విమ‌ర్శ‌ల తీవ్ర‌త పెంచుకుంటూ వ‌చ్చారు. అంతేకాకుండా ప‌వ‌న్‌, నేను కాపు నా కొడుకులం అంటూ సొంత కులాన్ని కూడా దూషించారు. దీంతో కాపు సామాజిక‌వ‌ర్గం పేర్ని నానిపై భ‌గ్గుమంది. అయినా స‌రే తాను జ‌గ‌న్‌కు పెద పాలేరున‌ని పేర్ని నాని త‌న భ‌క్తి ప్ర‌ప‌త్తులు చాటుకున్నారు. అయితే ఇంత చేసినా పేర్ని నానికి రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌వి పోయింది.

ఆ త‌ర్వాత కొన్నాళ్లుపాటు పేర్ని నాని సైలెంట్ అయిపోయారు. ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర వాగ్దాటితో విరుచుకుప‌డే నేత‌లు వైఎస్సార్సీపీలో కరువ‌య్యారు. దీంతో క‌ల‌వ‌రప‌డ్డ వైఎస్సార్సీపీ కొడాలి నాని, పేర్ని నానిల‌పైనే మ‌ళ్లీ ఆధార‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా పేర్ని నాని.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. జ‌న‌సేన ఒక పార్టీ కాద‌ని.. చంద్ర‌బాబు అనుకూల సంస్థ అని ఆరోపించారు. చంద్ర‌బాబుకు అనుకూలంగా ప‌నిచేసే సంస్థే.. జ‌న‌సేన అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

అమరావతి నుంచి అరసవల్లి వరకు సాగుతున్న రాజధాని ప్రాంత రైతుల మహాపాదయాత్రకు ఒక్క వైఎస్సార్సీపీ త‌ప్ప‌ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలకు అతీతంగా మద్దతు పలుకుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా బలమైన నాయకుడని, అందుకే ఆయనను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని మండిప‌డ్డారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతుగా గతంలో మాట్లాడారని పేర్ని నాని గుర్తు చేశారు. అమరావతి ప్రజా రాజధాని కాదని వామపక్షాలు కూడా విమర్శించాయన్నారు. ఇప్పుడు వీరంతా ముఠాగా ఏర్పడి దుష్ట‌చ‌తుష్ట‌యం సాయంతో అమరావతినే ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా మార్చాలని చూస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌ద్వారా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నార‌ని..  వీరంతా చంద్ర‌బాబు నాయుడు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని పేర్ని నాని విమ‌ర్శ‌లు సంధించారు.

మ‌రోవైపు పేర్ని నానిపై టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. హైకోర్టు అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధాని అని ఇప్ప‌టికే జ‌గ‌న్ మాడు ప‌గల‌కొట్టే తీర్పు ఇచ్చింద‌ని.. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మాడు ప‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ అమ‌రావ‌తికి అనుకూల‌మ‌న్నార‌ని.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించార‌ని మండిప‌డుతున్నారు. మాట త‌ప్ప‌డు-మ‌డ‌మ తిప్ప‌డు అని జ‌గ‌న్ గురించి వైఎస్సార్సీపీ నేత‌లు గొప్ప‌గా చెబుతార‌ని.. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ చేస్తుందేమిటో చెప్పాల‌ని టీడీపీ నేత‌లు నిప్పులు చెరుగుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News