అన్ని గొంతుకలూ ఒక్కటే పాట 'జై బోలో విదేశీ'

Update: 2015-10-16 04:16 GMT
అవును మరి.. ప్రధాని ఒక వైపు మేకిన్‌ ఇండియా అని నానా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు గానీ.. వాస్తవానికి ఆయన చేస్తున్నవన్నీ విదేశీ టూర్లే తప్ప స్వదేశీ టూర్లు కానే కాదు. అలాగే ఆయన ప్రభుత్వ ఆధ్వర్యంలో స్మార్ట్‌ సిటీలను అభివృద్ధి చేయబోయే వ్యవహారం మొత్తం విదేశీ సంస్థల భాగస్వామ్యానికి సంబంధించినది మాత్రమేగా ఉండబోతోంది. విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు పీపీపీ పద్ధతిలో స్మార్ట్‌ సిటీల పనులు ఇవ్వబోతున్నారు.

ఇటు ఏపీలో చూస్తే.. అక్కడంతా విదేశీ పాటే నడుస్తూ ఉంటుంది. జపాన్‌ వంటి విదేశీయుల్ని ఆకట్టుకోవడానికి తమ యూనివర్సిటీల్లో వారి భాషను నేర్చుకునే కోర్సులను కూడా ప్రవేశపెట్టేసిన ఘనత చంద్రబాబునాయుడుది. ప్రస్తుతం ఆయన తలపెడుతున్న రాజధాని మొత్తం విదేశీ సంస్థలే చేపట్టబోతున్నాయి.

ఇక మనం కూడా విదేశీ పాట పాడకపోతే బాగుండదని అనుకున్నదేమో తెలంగాణ సర్కారు కూడా ఆ పని చేస్తోంది. తెలంగాణలో ఉన్న పర్యాటక కేంద్రాలు అన్నిటినీ విదేశీ టూరిస్టులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్లుగా టూరిజం అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పేర్వారం రాములు చెప్పారు. రాష్ట్రంలో అనేక టూరిజం కేంద్రాలు ఉన్నాయని.. వాటిని విదేశీయుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామని అన్నారు.

అయినా ఇక్కడ శోచనీయమైన విషయం ఏంటంటే.. టూరిజం పరంగా తెలంగాణ ఎంతో సుసంపన్నమయిన ప్రాంతం అనే సంగతి అందరూ ఒప్పుకుంటారు. అయితే.. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సి ఉన్న మాట నిజమే. ఎంతైనా అభివృద్ధి చేయవచ్చు గానీ.. అదేదో విదేశీయులకోసమే అన్నట్లుగా చేయదలచుకోవడం మాత్రం భావదారిద్య్రం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మన కోసం మన ప్రాంతలను మనం అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నారు.
Tags:    

Similar News