ఇక ఆశలు వదులుకోండి.. పెట్రోలు - డీజిల్​ ఇప్పట్లో తగ్గించరట..!

Update: 2021-02-11 13:54 GMT
ఇటీవల పెట్రోల్​, డీజిల్​ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్​ బంకుల్లో అంత ధరకు పెట్రోలు కొట్టించుకుంటుంటే సామాన్యుడికి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రభుత్వాలు చొరవతీసుకొని ట్యాక్స్​లు తగ్గిస్తే.. బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.

పెట్రోలు, డీజిల్​పై ట్యాక్స్​లు తగ్గించే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేవని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ మేరకు ఇవాళ రాజ్యసభలో కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలపై కేంద్రం సమాధానం చెప్పింది. కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్​ సుంకం తగ్గించే ఆలోచన ఏమైనా చేస్తుందా? అంటూ ఓ సభ్యుడు ప్రశ్నించాడు. దీనికి కేంద్ర
పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ సమాధానం ఇచ్చారు.

‘పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం, తగ్గడం అనేది అంతర్జాతీయ మార్కెట్​ మీద ఆధారపడి ఉంటుంది. మనదేశంలో పెట్రో గనులు లేవు. అందువల్ల 85 శాతం దిగుమతులపైనే ఆధారపడ్డాం. అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర పెరిగితే సహజంగానే మనదేశంలో కూడా ధరలు పెరుగుతాయి.
దీనికి మనం ఏమీ చేయలేం’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడంపై కేంద్రప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు మనదేశంలో పెట్రోలు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని సోషల్​మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News