ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌ర‌ల్స్‌కు ఛాన్స్ .. టీడీపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి!

Update: 2021-08-31 02:30 GMT
టీడీపీలో ఇప్పుడు ఎస్సీ నేత‌లు క‌రువ‌య్యారా?  కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎస్సీ నేత‌లు లేక పార్టీ ఇబ్బందుల్లో ఉందా? అంటే.. ఔన‌నే అంటున్నారు పార్టీ సీనియ‌ర్లు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పార్టీకి నేత‌లు క‌రువ‌య్యా రనేది వాస్త‌వం. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వ‌ర్గాల‌కు నిర్దేశించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో..పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. అక్క‌డ ఉన్న నాయ‌కులు కొంద‌రు జంప్ చేయ‌డం.. మ‌రికొంద‌రు పార్టీకి త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటి రీజ‌న్ల‌తో టీడీపీ ఇరుకున ప‌డింది.

ఉదాహ‌ర‌ణ‌కు.. గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు అసెంబ్లీ నియోజ‌క‌వ ర్గం.. బాప‌ట్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం, కృష్ణాజిల్లా పామ‌ర్రు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, తిరువూరు అసెంబ్లీ స్థానం, చిత్తూరు జిల్లా చిత్తూరు.. ఇలా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ జెండా మోసే నాయ‌కుడు లేకుండా పోయారు. ఇవి ఆయా వ‌ర్గాల‌కు మాత్ర‌మే రిజ‌ర్వ్ చేశారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు.. కొత్త‌వారికి కేటాయించిన కార‌ణంగా.. పార్టీ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ.. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం.. ప్ర‌తి ఎన్నిక‌లోనూ కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌డం వంటివి టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టింది.

ప్ర‌త్తిపాడును తీసుకుంటే.. ప్ర‌స్తుతం జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థి, సీనియ‌ర్ నాయ‌కుడు మాకినేని పెద‌ర‌త్త‌య్య ఇంచార్జ్‌గా ఉన్నారు. ఈయ‌న పార్టీని న‌డిపిస్తున్నారు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు నాయ‌కుడి కొర‌త ఉంది. చిత్తూరులో డీఏ స‌త్య‌ప్ర‌భ మ‌ర‌ణించిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు నాయ‌కుడిని ఎంపిక చేయ‌లేక పోయారు. తిరువూరులో మాజీ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్‌కు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చారు. ఆయ‌న ఇది నాకొద్ద‌ని.. వెళ్లిపోయారు. ఇప్పుడు ఇక్క‌డ ఇంచార్జ్ పీఠం ఎవ‌రికీ అప్ప‌గించ‌కుండా చోద్యం చూస్తున్నారు. దీంతో కేడ‌ర్ అంతా.. వైసీపీలోకి వెళ్లిపోతోంది.

పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీతో రాజ‌కీయాలు ప్రారంభించిన ఉప్పులేటి క‌ల్ప‌న 2014లో వైసీపీలోకి వెళ్లి గెలిచి.. మ‌ధ్య‌లోటీడీపీలోకి వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆమె పార్టీలో యాక్టివ్‌గా ఉండ‌డంలేదు. అస‌లు ఉండాలా? వ‌ద్దా? అనే మీమాంస‌లో ప‌డిపోవ‌డంతో పార్టీని ఆమె ప‌ట్టించుకోవడంలేదు. మ‌రోవైపు ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు కైలే  అనిల్‌కుమార్ దూకుడుతో టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరును ఆశించిన మాజీ మంత్రికి రాజ‌మండ్రి పార్ల‌మెంట‌రీ పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

దీంతో కొవ్వూరులో కేడ‌ర్‌ను న‌డిపించే నాయ‌కుడు లేకుండా పోయారు. విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట‌ను ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్ర‌స్తుతం తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలి విష‌యంలోనూ చంద్ర‌బాబు క్లారిటీ ఇవ్వ‌డం లేదు. దీంతో అక్క‌డ కూడా టీడీపీని న‌డిపించేవారు లేక‌.. ఇర‌కాటంలో ప‌డుతున్నారు. బాప‌ట్ల పార్ల‌మెంట‌రీ స్థానం కూడా ఇలానే ఉంది. ఇక్క‌డ బాప‌ట్ల పార్టీ ఇంచార్జ్‌గా జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థి, ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావుకు అప్ప‌గించారు. అయితే.. ఇక్క‌డ నుంచి శ్రీరాం మాల్యాద్రి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాక అజా ప‌జా లేకుండా పోయారు. దీంతో ఇక్క‌డ కూడా పార్టీ ని న‌డిపించే ఎస్సీ నాయ‌కులు లేకుండా పోయారు. ఇలా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డం ఇప్పుడు చంద్ర‌బాబుకు త‌ల‌కు మించిన భారంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News