ప్రేయసికి 300 హోర్డింగ్ లతో సారీ..అరెస్ట్

Update: 2018-08-21 08:18 GMT
ప్రేమ ఎంతో మధురం.. ఆ ప్రేమలో దాగుడుమూతలు, గిల్లీకజ్జాలు సహజం.. నేడు ఉన్న కోపం రేపు ఉండదు.. ప్రియురాలు అలిగితే ఆమె కోరికలు తీరస్తూ ప్రియుడు కాకపడుతుంటాడు.ఆమె ప్రేమను తిరిగి పొందడానికి నానా తిప్పలు పడుతుంటాడు. మనం ఏదో ఫోన్ కొనిచ్చో లేక సినిమాలకు తీసుకెళ్లో కూల్ చేస్తాం.. కానీ ఇక్కడో బడా పారిశ్రామికవేత్త మాత్రం తన ప్రేయసి అలిగితే ఆమెకు 300 సారీలు చెప్పాడు.. అలా ఇలా కాదు.. నగరమంతా 300 ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా ఈ పనిచేశాడు.

ఫుణెలోని పంప్రి చింద్వాడ్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త నీలేశ్ ఖేడేకర్ తన ప్రేయసితో ఇటీవల గొడవపడ్డాడు. ఆమె కోపాన్ని తగ్గించడానికి ఓ వినూత్న  ప్లాన్ చేశాడు. ఆమె ముంబై నుంచి ఫుణెకు వస్తుందని తెలిసి.. ఆమె కోపాన్ని తగ్గించడానికి ఆమె కారులో వెళ్లే దారిలో.. ఇతర రద్దీ ప్రాంతాల్లో ‘ఐయామ్ సారీ’ అని రాసున్న పెద్ద పెద్ద బ్యానర్లు - ఫ్లెక్సీలు  - హోర్డింగ్ లు కట్టించాడు. శుక్రవారం నగరంలో ఈ బ్యానర్లను చూసి పోలీసులు షాకయ్యారు. అనుమతి లేకుండా ఇలా ఒక వ్యక్తి కోసం బ్యానర్లు కట్టడంపై మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బ్యానర్లు కట్టించిన వ్యక్తి గురించి ఆరా తీయగా.. నీలేశ్ అనే వ్యాపారవేత్త అని తేలింది. అతనిపై కేసు నమోదు చేశారు. నీలేశ్ తన స్నేహితుల ద్వారా ఈ పని చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రియురాలికి సారీ ఏమోకానీ ఇప్పుడీ కేసు నీలేశ్ మెడకు చుట్టుకుంది.  ఈ ప్రేమికుడు ఇప్పుడు  కటకటాల పాలవబోతున్నాడు..
Tags:    

Similar News