ఆమోదం తెలపలేదన్న కేంద్ర మంత్రి..ఏపీ ఆశలపై నీళ్లు

Update: 2019-06-28 14:33 GMT
కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ ఒక్కో పనిని చేయించుకోవాలని భావిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్వతహాగా మెజారిటీ సంపాదించి - వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగానే పనులు చేయించుకుంటామని గతంలో ప్రకటించినట్లుగా.. జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర నుంచి నిధులు - పలు ప్రాజెక్టులకు అనుమనులు తెప్పించుకోగలుగుతున్నారు.

 ఇదే తరహా సంబంధాలు కొనసాగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి షాకింగ్ న్యూస్ చెప్పారు. అది కూడా కీలకమైన ప్రాజెక్టు విషయంలో కావడంతో ఇది చర్చనీయాంశం అవుతోంది. దీంతో ఈ వార్త ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విశాఖపట్నం - చెన్నై మధ్య ఈస్ట్‌ కోస్ట్‌ ఎకనమిక్‌ కారిడార్‌ విషయంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.

 ‘‘విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పనుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనకు నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (ఎన్‌ ఐసీడీఐటీ) ఇంకా ఆమోదం తెలపలేదు. ఇది పరిశీలనలో మాత్రమే ఉంది. అందువలన ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌ అభివృద్ధి కోసం ఎలాంటి నిధుల కేటాయింపు కూడా జరగలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం ఈ కారిడార్‌ లో భాగంగా విశాఖపట్నం - మచిలీపట్నం - చిత్తూరు - దొనకొండలను అభివృద్ధి కేంద్రాలుగా ఏషియన్‌ డెవలప్‌ మెంట్‌ ‌ బ్యాంక్‌ (ఏడీబీ) గుర్తించింది. దీని కోసం ఏడీబీ ఇప్పటి వరకు 63.1 కోట్ల రూపాయలు విడుదల చేసింది’’ అని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో ఏపీ ఆశలపై నీళ్లు జల్లినట్లైంది.

 ఈ ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ లో పారిశ్రామికాభివృద్ది కోసం ప్రత్యేక ప్రాజెక్టు నెలకొల్పాలనుకున్న సమయంలోనే ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. 2.5 బిలియన్ డాలర్లు ఖర్చుతో విశాఖ - కాకినాడ - మచిలీపట్నం - అనంతపురం - ఏర్పేడు-శ్రీకాళహస్తిలలో ఐదు ఇండస్ట్రీయల్ జోన్లు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో దీనిని ప్రారంభించారు. ఏడీబీ సహకారం అందించడానికి ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టు తక్కువ వ్యవధిలోనే పూర్తవుతుందని అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా దీనికి బ్రేక్ పడిపోయింది.
 
Tags:    

Similar News