రావెల‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్‌.. ఎక్క‌డ‌న్న‌ది స‌స్పెన్స్!

Update: 2019-01-28 11:30 GMT
2014లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మాజీ ఐఏఎస్ అధికారి రావెల కిషోర్ బాబు.. విజ‌యం సాధించ‌టం బాబు మంత్రివ‌ర్గంలో ఆయ‌న‌కు స్థానం ల‌భించ‌టం తెలిసిందే. మంత్రి అయిన నాటి నుంచి తెలంగాణ అంశాల‌పై యాక్టివ్ గా ఉంటూ.. ప‌లు విమ‌ర్శ‌లు చేసి.. త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్క‌టం తెలిసిందే.అయితే.. ఆయ‌న ప‌నితీరు బాగోలేద‌ని.. ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న వేళ ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి బాబు త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే.

త‌ర్వాతి కాలంలో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రావెల జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా గుంటూరులో పార్టీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసిన సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. తోట చంద్ర‌శేఖ‌ర్ ల‌కు టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేయ‌ట‌మేకాదు.. వారు ఏ స్థానాల నుంచి ఏ ఎన్నిక‌ల‌కు పోటీ చేయ‌నున్న‌ది చెప్పారు. అదే స‌మ‌యంలో మాజీ మంత్రి రావెల విష‌యంలో మాత్రం పార్టీ టికెట్ ఇస్తున్న‌ట్లు చెప్పారే కానీ.. ఆయ‌న పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం పేరును మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.

పార్టీ టికెట్ ఇస్తున్న‌ట్లు చెప్పిన‌ప్ప‌టికీ.. నియోజ‌క‌వ‌ర్గం విష‌యాన్నిఎందుకు ఫైన‌ల్ చేయ‌లేద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. త‌న‌కు ఉండాల్సిన రీతిలో వ్యూహాలు ఉన్నాయ‌ని.. అంద‌రికి స‌మ‌న్యాయం చేస్తామ‌ని చెబుతున్నారు ప‌వ‌న్‌. రావెల కోరుకున్న నియోజ‌క‌వ‌ర్గంపై కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయ‌ని.. వాటిపై క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత అధికారికంగా ప్ర‌క‌టించే వీలుందంటున్నారు. ఈ కొత్త స‌స్పెన్స్ ఎప్ప‌టికి తీరుతుందో చూడాలి.
Tags:    

Similar News