త్వరలో పీకే నోట.. టీఆర్ఎస్ ఓటమి మాటనట.. రేవంత్ జోస్యం

Update: 2022-04-25 10:30 GMT
సీఎం కేసీఆర్ తో ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ సారథి ప్రశాంత్ కిషోర్ (పీకే) భేటి కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ భేటితో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటి అయిన పీకే.. అనంతరం హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో భేటి కావడంతో వీరి మధ్య పొత్తు ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే తాజాగా కేసీఆర్ ను కలిశారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక టీఆర్ెస్ కు, ఐప్యాక్ తో పీకే కు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు.

పీకే కాంగ్రెస్ లో చేరిన తర్వాత రాష్ట్రానికి వచ్చి తనతో ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టే రోజు దగ్గరలోనే ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్ ను ఓడించండని ఆయన నోటి నుంచే చెప్పిస్తానని రేవంత్ శపథం చేయడం విశేషం. పీకే కాంగ్రెస్ లో చేరాక ఆయనకు పార్టీ అధిష్టానం మాటే ఫైనల్ అని రేవంత్ రెడ్డి అన్నారు.

తాను కాంగ్రెస్ లో చేరినా తన ఐప్యాక్ సంస్థ టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని ప్రగతి భవన్ లో రెండు రోజుల భేటి అనంతరం ఆదివారం కేసీఆర్ కు పీకే తెలిపారు. ప్రత్యామ్మాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ను కలుపుకొని వెళ్లే విషయంపై ఆలోచించాలని కోరారు.

తాము బీజేపీ, కాంగ్రెస్ లతో సమదూరం పాటిస్తామని అంటున్న కేసీఆర్ ఇప్పుడు పీకేకు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ తో పీకే భేటిపై రేవంత్ రెడ్డి ఈ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు ఉండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టైంది.
Tags:    

Similar News