అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బయిపోకుండా బాబు మిత్రుడి మాస్టర్ ప్లాన్

Update: 2019-06-03 04:19 GMT
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో దెబ్బతిన్నారో ఆయన మిత్రుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత - దిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అంతే స్థాయిలో దెబ్బతిన్నారు. దిల్లీలోని 7 లోక్ సభ సీట్లలోనూ ఆప్ ఓటమి పాలయింది. అక్కడ అన్ని సీట్లనూ బీజేపీయే గెలుచుకుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల రాకముందే కేజ్రీవాల్ జాగ్రత్తపడడం ప్రారంభించారు. ఏదో ఒకటి చేయకపోతే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీయే గెలవడం ఖాయమని - తన సీఎం సీటు పోవడం గ్యారంటీ అని గుర్తించిన కేజ్రీవాల్ నష్టనివారణ చర్యలకు దిగారు. అందులో భాగంగా ఓటర్లను ఆకట్టుకునే మాస్టర్ ప్లాన్ ఒకటి రచించారు.

దిల్లీలో వర్కింగ్ పీపుల్ శాతం చాలా ఎక్కువ. చిన్నస్థాయి నుంచి పెద్ద స్థాయి ఉద్యోగాలు చేసేవారి వరకు రోజూ ఉదయం - సాయంత్రం ఆఫీసులకు తిరుగుతుంటారు. వీరిలో పురుషులతో సమానంగా మహిళలూ ఉంటారు. వీరిలో 99 శాతం మందికి మెట్రో రైలే ప్రధాన ప్రయాణ సాధనం. సొంత వాహనాలు ఉన్నవారు కూడా మెట్రోను ఆశ్రయిస్తుంటారు. ట్రాఫిక్ జామ్ సమస్య లేకుండా హాయిగా ఏసీ ప్రయాణం చేసి అతి తక్కువ సమయంలో ఆఫీసులకు చేరుకోవడానికి ఆడా మగా మెట్రో పైనే ఆధారపడతారు. దిల్లీ నగరంలో మెట్రో దాదాపుగా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తుంది. దీంతో సిటీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు మెట్రో పరిధిలోకి వస్తారు.

ఈ లాజిక్ పట్టుకున్న కేజ్రీవాల్ మెట్రోలో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే దిశగా అడుగులేస్తున్నారు. మెట్రోలు కవర్ చేయని ప్రాంతాల మహిళలనూ ఆకట్టుకునేందుకు ఆయన బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది.  ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులతో  సమావేశమయ్యారు కూడా.

ఇప్పటికే దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఢిల్లీ మెట్రోపై తమకు పూర్తి అధికారం అప్పగిస్తే ఛార్జీలను 25 నుంచి 30 శాతం తగ్గిస్తామని ప్రకటించారు. అయితే మహిళల ఉచిత ప్రయాణం విషయంపై రేపు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. కేజ్రీ కనుక ఇది సాధ్యం చేయగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను ఎదుర్కోవడం బీజేపీకి కష్టమే.
Tags:    

Similar News