హెలికాఫ్ట‌ర్ పంపాలంటూ లైవ్ లో ఎమ్మెల్యే కంట‌త‌డి

Update: 2018-08-18 07:44 GMT
వందేళ్ల త‌ర్వాత విరుచుకుప‌డుతున్న జ‌ల‌విల‌యంతో కేర‌ళ రాష్ట్రం క‌కావిక‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రాణాలు పోవ‌ట‌మే కాదు.. ల‌క్ష‌లాది మంది స‌హాయ‌క కేంద్రాల్లో త‌ల‌దాచుకుంటున్నారు. మ‌రోవైపు.. చుట్టూ వ‌ర‌ద నీరు ముంచెత్త‌టంతో ప‌లు గ్రామాలు జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వంద‌లాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప‌రిస్థితి నెల‌కొంది.

గ‌డిచిన 11 రోజులుగా కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నా.. జాతీయ మీడియా అటెన్ష‌న్.. ప‌లు రాష్ట్రాలతో పాటు.. కేంద్రం సైతం మూడు రోజులుగానే స్పందిస్తోంది. ఇదిలా ఉంటే.. ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్న గ‌గ్గోలు కేర‌ళీయులు చేస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ చూడ‌నంత జ‌ల‌ప్ర‌ళ‌యంతో వారు బెంబేలెత్తిపోతున్నారు.

ఇదిలా ఉంటే.. త‌మ ప‌రిస్థితిని గుర్తించి ప్ర‌ధాన‌మంత్రి వెనువెంట‌నే స్పందించాల‌ని.. హెలికాఫ్ట‌ర్ల‌ను పెద్ద ఎత్తున పంపాల‌ని చెంగ‌న్నూరు ఎమ్మెల్యే సాజీ చెరియ‌న్ వేడుకుంటున్నారు.

తాజాగా ఒక చాన‌ల్ లైవ్ లో ఆయ‌న క‌న్నీరు పెట్టుకున్నారు. త‌మ ప‌రిస్థితిని అర్థం చేసుకొని ప్ర‌ధాని వెంట‌నే త‌మ ప్రాంతాల‌కు హెలికాఫ్ట‌ర్ల‌ను పంపాల‌ని ఆయ‌న కోరుతున్నారు. బాధితుల్ని త‌ర‌లించేందుకు వాయు మార్గం మిన‌హా మ‌రో మార్గం లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. జ‌ల‌విల‌యం కార‌ణంగా చుట్టూ నీరు క‌మ్మేసింద‌ని.. వాయుమార్గంలోనే బాధితుల్ని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే వీలుంద‌ని చెబుతున్నారు.

త‌న ప‌రిధిలో దాదాపు 50 వేల మంది ప్రాణాల‌కు ముప్పు వాటిల్లింద‌ని.. ద‌య‌చేసి హెలికాఫ్ట‌ర్ల‌ను పంపాల‌ని ఆయ‌న వేడుకుంటున్నారు. ఫిషింగ్ బోట్ల‌తో స‌హా తాము చేయ‌గ‌లిగిన‌దంతా చేస్తున్నామ‌ని.. ఇంత‌కు మించి తామేమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్లు ఆయ‌న చెబుతున్నారు.

టీవీ లైవ్ లో ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి.. ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్.. అంటూ ఎమ్మెల్యే వేడుకున్న వైనం చూస్తే.. కేర‌ళ‌లో ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలిసే ప‌రిస్థితి. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో ఎన్టీఆర్ ఎఫ్ కి చెందిన 79 బోట్ల‌తో పాటు 400ల‌కు పైగా మ‌త్స్య‌కారుల బోట్లు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నా.. బాధితులు పెద్ద ఎత్తున ఉండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News