మోడీ వారసురాలిపై వేటు రెఢీ..?

Update: 2016-05-16 13:53 GMT
గుజరాత్ ముఖ్యమంత్రిగా తన సత్తా చాటిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రధాని పదవిని చేపట్టేందుకు వీలుగా.. గుజరాత్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన వారసురాలిగా గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం మీద తనకెంతో సన్నిహితురాలైన ఆనంది బెన్ పటేల్ కు సీఎం పదవిని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. రెండేళ్లు గడుస్తున్నా.. గుజరాత్ ముఖ్యమంత్రిగా తన మార్క్ ను ప్రదర్శించటంలో ఆనంది బెన్ పటేల్ విఫలం కావటం.. మరో ఏడాదిలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. మోడీ అలెర్ట్ అయ్యారని చెబుతున్నారు.

కాస్త సమయం ఇస్తే ఆనంది బెన్ పటేల్ పుంజుకుంటారని భావించినా.. అలాంటిదేమీ లేకపోవటం.. నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం జరిగితే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న భావనతో ఆమెపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైందని చెబుతున్నారు. అయితే.. ఆమె ఫెయిల్ అయినట్లుగా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున ఆమెను పంజాబ్ గవర్నర్ గా పంపి.. ఆమె స్థానంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని నియమించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

వచ్చే ఏడాది జరిగే గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న మోడీ.. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. పాలనా పరంగా మరింత వేగం పెంచేందుకు వీలుగా.. కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్న మోడీ.. కేంద్రమంత్రివర్గంలోనూ మార్పులు చేస్తారన్న టాక్ ఇప్పుడు ఢిల్లీలో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
Tags:    

Similar News