మోడీకి అలాంటి నీళ్లు తాగించిన ఇజ్రాయెల్ ప్ర‌ధాని

Update: 2017-07-07 06:07 GMT
ప్ర‌ధాని మోడీ ప్ర‌స్తుతం ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. తొలిసారి భార‌త్ ప్ర‌ధాని ఒక‌రు ఆ దేశానికి వెళ్లిన వైనానికి త‌గ్గ‌ట్లే.. ఘ‌న‌మైన స్వాగ‌త ఏర్పాట్ల‌ను ఇజ్రాయెల్ చేసింది. అమెరికా అధ్య‌క్షుడు.. పోప్ ల‌కు మాత్ర‌మే చేసే ఏర్పాట్ల‌ను మోడీకి చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ దేశంలో ప‌ర్య‌టించిన ఏ విదేశీ నేత‌కు ద‌క్క‌నంత సాద‌ర స‌త్కారం.. ఏర్పాట్లు మోడీకే ద‌క్కాయంటే అతిశ‌యోక్తి కాదు.

ఇజ్రాయెల్ దేశాధ్య‌క్షుడు ప‌లు సంద‌ర్భంగాల్లో ప్ర‌ధాని మోడీ వెంటే ఉన్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్ర‌ధాని కూడా మోడీకి పెద్ద పీట వేశారు. వారిద్ద‌రు క‌లిసి ఇజ్రాయెల్ లోని ఓల్గా బీచ్ లో ఉల్లాసంగా గ‌డిపారు. అమెరికా అధ్య‌క్షుడు ఒబామా భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా.. మోడీ ఆయ‌న‌కు టీ స్వ‌యంగా క‌లిసి ఇవ్వ‌టం.. ఆ త‌ర్వాత ఇరువురు అధినేత‌లు న‌డుస్తూ మాట్లాడుకున్న సీన్‌ ను త‌ల‌పించేలా తాజా సీన్ చోటు చేసుకుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బీచ్ లో న‌డుస్తూ ఇరువురు అధినేత‌లు చాలాసేపు మాట్లాడుకున్నారు. అనంత‌రం బీచ్ లో ఉన్న డీశాలినేష‌న్ మొబైల్ ప్లాంట్‌ ను సంద‌ర్శించారు. ఈ ఫ్లాంటు ప్ర‌త్యేక‌త‌ల్ని ప్ర‌ధాని మోడీకి ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్యాహు వివ‌రించారు. రోజుకు 20వేల లీట‌ర్ల ఉప్ప నీటిని.. 80వేల క‌లుషిత న‌దీజ‌లాల్ని శుద్ధిచేసే స‌త్తా స‌ద‌రు ఫ్లాంట్ సొంత‌మ‌ని పేర్కొన్నారు.

అంతేనా.. క‌లుషిత న‌దీజాలాల్ని శుద్ధి చేసిన నీటిని ఇరువురు అధినేత‌లు స్వ‌యంగా తాగారు. మొబైల్ యూనిట్ ను స్వ‌యంగా న‌డిపారు. అతి త‌క్కువ ఖ‌ర్చుతో కలుషిత నీటిని.. స‌ముద్ర ఉప్ప‌నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చే సాంకేతిక‌త ఇజ్రాయెల్ సొంతం. దీనికి సంబంధించిన ఒక ఒప్పందం మీద ఇరువురు అధినేత‌ల బృందం సంత‌కాలు చేశారు. వీవీఐపీ లాంటి మోడీ.. శుద్ధి చేసిన క‌లుషిత నీటిని తాగ‌టం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News