టీడీపీకి ఢిల్లీలో ఇదో ఘోర అవ‌మానం

Update: 2018-06-28 14:57 GMT
అధికార తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో ఊహించ‌ని ట్విస్ట్‌ లు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ క‌డ‌ప ఎంపీ సీఎం రమేశ్‌ దీక్ష  చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తొమ్మిదో రోజు కొనసాగుతున్న దీక్ష‌తో సీఎం రమేశ్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది. అయితే ఆయ‌న దీక్ష‌తో మైలేజ్‌ పెంచుకోవాల‌ని చూస్తున్న టీడీపీకి ఢిల్లీ కేంద్రంగా ఊహించ‌ని ట్విస్ట్‌లు ఎదుర‌వుతున్నాయి. హ‌స్తిన‌లో హ‌డావుడి చేయాల‌ని భావిస్తున్న టీడీపీ ఎంపీలు ప్రధానమంత్రిని అపాయింట్ మెంట్ కోరారు. అయితే టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యేందుకు ప్రధాని నిరాకరించారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ చేపడుతున్న నిరసనలు..దీక్షలపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల అనంతరం..ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటివి చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ టీడీపీ ఎంపీలు ప్రధానమంత్రి అపాయింట్‌ మెంట్ కోరారు. అయితే ఆయ‌న నో చెప్పారు. ఎన్‌ డీఏ కూట‌మి నుంచి టీడీపీ గుడ్ బై చెప్పిన అనంత‌రం టీడీపీ నేత‌లు బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటుపై చేస్తున్న రాజ‌కీయంపై ప్ర‌ధాని గుస్సా అయ్యార‌ని స‌మాచారం. అందుకే ఆయ‌న అపాయింట్‌ మెంట్ నిరాక‌రించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రోవైపు బుధ‌వార‌మే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - మంత్రి కేటీఆర్‌ కు ప్ర‌ధాని అపాయింట్‌ మెంట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా కేటీఆర్ క‌లిసింది కూడా ఉక్కు ఫ్యాక్ట‌రీకి సంబంధించిన ఎజెండాతోనే. అలా ఒకే విష‌యంలో ఒక రాష్ట్రంలోని అధికార పార్టీప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించి మ‌రో పార్టీకి నో చెప్ప‌డం టీడీపీకి ఎదుర‌వుతున్న ట్విస్టుల ప‌రంప‌ర‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు అంటున్నారు.

ఇదిలాఉండ‌గా... ప్ర‌ధాన‌మంత్రి అపాయింట్‌ మెంట్‌ దొరకకపోవడంతో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ తో మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. చిత్రంగా అపాయింట్‌ మెంట్ కోరిన‌ప్ప‌టికీ...ఉదయం మంత్రి బీరేంద్ర సింగ్ లేని సమయంలో ఆయన నివాసంలోనే ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు నిర‌స‌న తెల‌ప‌డం కొస‌మెరుపు.
Tags:    

Similar News