అమెరికా అధ్య‌క్షుడ్ని దాటేసిన మోడీ

Update: 2017-07-06 05:52 GMT
చ‌రిత్ర‌లో తొలిసారి భార‌త దేశ ప్ర‌ధాని ఒక‌రు ఇజ్రాయెల్‌కు వెళ్ల‌టం తెలిసిందే. ఈ అరుదైన ఘ‌న‌త‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సొంతం చేసుకున్నారు. త‌నదైన‌ విదేశాంగ‌ విధానంతో ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న‌దైన ముద్ర‌ను వేశారు మోడీ. ముఖ్యంగా విదేశీ అధినేత‌ల‌తో ఆయ‌న‌ వ్య‌వ‌హ‌రించే తీరు భిన్నంగా ఉంటుంది. భావోద్వేగ సంబంధాల‌తో పాటు.. ఆర్థిక బంధాన్ని మిక్స్ చేసి.. భార‌త ప్ర‌ధాని ప‌ద‌వికి స‌రికొత్త ఇమేజ్‌ ను తీసుకొచ్చారు మోడీ.

తాజాగా త‌న ఇజ్ర‌యెల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన మోడీకి ద‌క్కుతున్న అసాధార‌ణ మ‌ర్యాద‌లు భార‌తీయుల్ని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాంకేతికంగా ఎంతో ముందంజ‌లో ఉన్న ఇజ్రాయెల్ లో భార‌త్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉండ‌టంపై ప‌లువురు భార‌తీయులు గ‌తంలో బాధ ప‌డేవారు. ఆ లోటును తీరుస్తూ మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రిని ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

అన్నింటికి మించి.. ఆయ‌న విదేశాంగ విధానంతో ప‌లు దేశాలు ఇప్పుడు భార‌త్‌ కు ఇస్తున్న ప్రాధాన్య‌త‌ల్లో మార్పు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. తాజా ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీకి ద‌క్కిన స్వాగ‌త స‌త్కారాలు.. మ‌ర్యాద‌ల్ని చూస్తున్న వారు కొంద‌రు విశ్లేషిస్తూ.. అమెరికా అధ్య‌క్షుడికి కూడా ఇంత‌టి మ‌ర్యాద‌లు ద‌క్క‌లేద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ లో ఉన్న భార‌తీయులైతే ఇప్పుడు ఆనందంతో ఉబ్బిత‌బ్బుబ్బిపోతున్నారు. గ‌తంలో భార‌తీయుల‌కు పెద్ద మ‌ర్యాద ఉండేది కాద‌ని.. తాజాగా వ‌చ్చిన మార్పుల‌తో ఇప్పుడక్క‌డ ప్ర‌త్యేక గుర్తింపు ల‌భిస్తోంద‌ని చెబుతున్నారు. ఇజ్రాయెల్ లో భార‌త్‌కు చెందిన వారు దాదాపు ఎనిమిది ల‌క్ష‌ల మంది ఉన్నారు. వీరిలో మొత్తం నాలుగు ర‌కాల తెగ‌ల వారు జీవిస్తుంటార‌ని చెబుతారు. ముంబ‌యికి చెందిన బెనీ తెగ వారు.. కేర‌ళకు చెందిన కొచిన్‌.. మ‌ణిపూర్‌.. మిజోరాంల‌కు చెందిన బినై మెన‌షే తెగ‌వారు ఉంటారు.

ఇజ్రాయెల్‌ లో యూదుల‌కు ఎంతో గౌర‌వం ల‌భిస్తుంటుంద‌ని.. అంత‌టి గౌర‌వం త‌మ‌కు ఎప్పుడు ల‌భిస్తుంద‌ని భార‌తీయులు అనుకునే వార‌ని.. ఇప్పుడా కొర‌త కొంత‌మేర తీరుతుంద‌ని చెబుతున్నారు. ఇదంతా మోడీ కార‌ణంగానే అన్న అభిప్రాయాన్ని అక్క‌డి భార‌తీయులు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News