నీర‌వ్ మోదీకి ఈడీ షాక్

Update: 2018-10-01 09:55 GMT
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల‌కు చెక్కేసిన వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీపై ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ తాజాగా కొర‌డా ఝుళింపించింది. నీర‌వ్‌ తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు చెందిన రూ.637 కోట్ల విలువైన ఆస్తుల‌ను జ‌ప్తు చేసి షాకిచ్చింది.

ఈడీ జ‌ప్తు చేసిన నీర‌వ్ కుటుంబ ఆస్తుల్లో మ‌న‌దేశంలోని ఆస్తుల‌తోపాటు విదేశాల్లోని సంప‌ద కూడా ఉంది. భార‌త్‌ తోపాటు బ్రిట‌న్‌ - అమెరికాల్లో నీరవ్ ఫ్యామిలీకి చెందిన స్థిరాస్తులు - ఆభ‌రణాలు - బ్యాంక్ బ్యాలెన్స్‌ ల‌ను తాము స్వాధీనం చేసుకున్న‌ట్లు ఈడీ అధికారులు ప్ర‌క‌టించారు. పీఎన్‌ బీ కుంభ‌కోణం కేసు ద‌ర్యాప్తులో ఇదో పెద్ద ముంద‌డుగ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సాధార‌ణంగా ఈడీ ఎగ‌వేత‌దారుల విష‌యంలో మ‌న‌దేశంలోని వారి ఆస్తుల‌నే జ‌ప్తు చేస్తుంటుంద‌ని.. విదేశాల్లో ఆస్తుల‌ను జ‌ప్తు చేయ‌డం చాలా అరుద‌ని వారు చెబుతున్నారు.

ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్న ఈడీ ఇక నీర‌వ్‌ ను స్వ‌దేశానికి ర‌ప్పించ‌డంపై పూర్తిగా దృష్టి కేంద్రీక‌రించే అవ‌కాశ‌ముంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం అత‌డు బ్రిట‌న్‌ లో త‌ల‌దాచుకుంటున్న‌ట్లు స‌మాచార‌ముంది. అత‌ణ్ని అప్ప‌గించాలంటూ కేంద్ర‌ప్ర‌భుత్వం ఆ దేశాన్ని కోరింది. అయితే, భార‌త్ అభ్య‌ర్థ‌న‌పై బ్రిట‌న్ ఇప్ప‌టివ‌ర‌కు నిర్దిష్టంగా స్పందించ‌లేదు. మ‌రోవైపు, ఇదే పీఎన్‌ బీ కుంభ‌కోణంలో నీర‌వ్‌ తోపాటు కీల‌క నిందితుడిగా ఉన్న అత‌డి మేన‌మామ మెహుల్ చోక్సీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసేందుకు కూడా ఈడీ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. పీఎన్‌ బీ కుంభ‌కోణం వెలుగుచూడ‌క ముందే ప‌క్కా ప్ర‌ణాళిక‌తో చోక్సీ కూడా విదేశాల‌కు చెక్కేసిన సంగ‌తి తెలిసిందే. భార‌త్ నుంచి వెళ్లాక కొన్నాళ్ల‌పాటు అమెరికాలో గ‌డిపిన చోక్సీ.. ఆ త‌ర్వాత యాంటిగ్వాకు షిఫ్ట్ అయ్యాడు. ప్ర‌స్తుతం అక్క‌డే మ‌కా వేశాడు. అత‌ణ్ని స్వ‌దేశానికి రప్పించేందుకూ భార‌త అధికార యంత్రాంగం ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, చోక్సీని అప్ప‌గించాలంటూ భార‌త్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అధికారిక అభ్య‌ర్థ‌నేదీ త‌మ‌కు అంద‌లేద‌ని యాంటిగ్వా ప్ర‌భుత్వం ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి గ‌మ‌నార్హం.

Tags:    

Similar News