పోలవరం ముంపులో ప్రభుత్వం !

Update: 2022-07-25 07:31 GMT
పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్ప‌టి నుంచో వివాదాలు రేగుతూనే ఉన్నాయి. వాటిని వేగంగా ప‌రిష్క‌రించాల‌న్న ధ్యాస అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ లేవు అన్న‌ది ఓ విమ‌ర్శ. కేంద్రం అయితే నిధుల వెచ్చింపుల్లో తాత్సారం ఉంద‌ని మాత్రం పార్ల‌మెంట్ వేదిక‌గా తేల్చేసింది. అదేవిధంగా ప్రాజెక్టు ప‌నుల్లో వేగం  లేద‌ని కూడా తేల్చేసింది.

ముఖ్యంగా బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టుగా పోల‌వ‌రంను పేర్కొన్న‌ప్పుడు ముందుగా సాల్వ్ చేయాల్సింది ముంపు గ్రామాల స‌మ‌స్య‌నే !  కానీ ఏపీ స‌ర్కారు అందుకోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

ముంపు ప్రాంతాల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మరోవైపు తెలంగాణ ఆంధ్ర మంత్రులు ఈ వ్యవహారంపై అసలు విషయం వదిలేసి రకరకాల వాదాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త అంశం వెలుగులోకి వచ్చిందంటున్నారు.

ఈ రోజు ఓ ప్ర‌ధాన మీడియాలో  ఓ సంచలన కథనం ప్రచురించింది. అందులో ఏముందంటే....   పోలవరం కేవలం నిర్లక్ష్యం వల్లనే ఆలస్యం అవుతోందని ఉన్నట్లు రాసుకొచ్చింది. అది ఐఐటీ హైదరాబాదు నిపుణులు అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక అని... అందులో పోలవరం ఎందుకు ఆలస్యం అయ్యిందో కూలంకుషంగా విశదీకరించారని మీడియా కథనంలో రాశారు.

ఈ రిపోర్టులో ముఖ్యంగా...  కాంట్రాక్ట‌ర్ల మార్పు ప్రాజెక్టు ప‌నుల పురోగ‌తికి పెను శాపంగా మారినట్లు పేర్కొన్నారట. ముఖ్యంగా పున‌రావ‌సం పేరిట కాల‌యాప‌న మరో ప్రధాన కారణమట.  రీ టెండ‌రింగ్, రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరిట కాంట్రాక్ట‌ర్ల మార్పుతో కొంత, త‌రువాత పనుల్లో జాప్యం కొంత పోల‌వ‌రానికి శాపంగానే ప‌రిణ‌మిస్తున్నాయట.  

మరోవైపు టీడీపీపై కూడా దీనిపై స్పందించింది. ప్ర‌భుత్వానికి ఏ ప్రణాళికా లేక‌పోవ‌డ‌మే అతి పెద్ద స‌మ‌స్య అని టీడీపీ అధినేత ఆరోపించారు. ప్రాజెక్టు ప‌నులు ప‌ర్య‌వేక్షణ‌లో ముఖ్యమంత్రికి ఆసక్తి లేదని, జలవనరుల మంత్రులకు అవగాహన లేదని తెలుగుదేశం ఆరోపించింది.
Tags:    

Similar News