పెండింగ్ చలాన్ కోసం పోలీసుల పట్టు.. చిన్నారి మృతి

Update: 2022-06-01 09:31 GMT
పెండింగ్ చలాన్ కోసం పోలీసుల అత్యుత్సాహం ఒక చిన్నారి ప్రాణాలు పోయేలా చేసింది.పెండింగ్ చలానా కట్టాలని 45 నిమిషాలు కారును రోడ్డుపైనే పోలీసులు నిలిపివేశారు. ఆస్పత్రికి వెళ్లాలని ఎంత వేడుకున్నా కనికరించకపోవడంతో కారులో ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న చిన్నారి పరిస్థితి మరింత విషమించి కన్నుమూశాడు.

జనగామ జిల్లాలో పోలీసుల తీరు కారణంగానే మా కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. కుమారుడు మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసుల తీరుపై తీవ్రస్తాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

జనగామ మండలం మరిగడికి చెందిన మచ్చమల్లేషం సరస్వతి దంపతుల మూడు నెలల బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి జనగామ వైద్యులు రిఫర్ చేశారు. దీంతో హుటాహుటిన బాబును హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోకి కారు ప్రవేశించింది. యాదాద్రికి సమీపంలోని వంగపల్లి వద్ద పోలీసులు కారును నిలిపారు. కారు డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా కారును ఆపారు. ఈ కారుపై పెండింగ్ చలానా ఉంది. అయితే ఈ పెండింగ్ చలాన్ చెల్లిస్తేనే కారును వదిలేస్తామని కారును నిలిపివేశారని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సుమారు 45 నిమిషాల పాటు కారును ఆపారని.. చిన్నారికి చికిత్స అందించాలని.. పరిస్థితి విషమంగా ఉందని బాలుడు కుటుంబ సభ్యులు వేడుకున్నా పోలీసులు కనికరించలేదని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆస్పత్రికి ఆలస్యంగా వెళ్లడం కారణంగా మా కుమారుడు మరణించినట్టు మృతుడి కుటుబ సభ్యులు ఆరోపించారు.

కారులో ప్రాణాప్రాయ స్థితిలిలో  నా కొడుకు ఉన్నాడు. వెంటనే వదలాలని వేడుకున్నా పోలీసులు కనికరించలేదని బాలుడి తల్లి వాపోయింది. చలానా చెల్లిస్తేనే వదిలేస్తామని అన్నారని.. ఫలితంగా ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ఆలస్యం కావడంతో తన కొడుకు మృతిచెందాడని మృతుడి తల్లి వాపోయింది.
 
ఈ విషయంపై పోలీసులు స్పందించారు. తమ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో జనగామ జిల్లా నుంచి వస్తున్న కారు డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే తమ సిబ్బంది ఆపారని చెప్పారు. కారులో అనారోగ్యంతో ఉన్న బాలుడు ఉన్నాడని.. ఆస్పత్రికి తీసుకెళుతున్నామని చెప్పలేదని తెలిపారు.
Tags:    

Similar News