ఛానల్ షూటింగ్.. అంతా మసాలానేనా?

Update: 2015-07-18 13:29 GMT
గోదావరి పుష్కరాల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట.. ఈ సందర్భంగా 27 మంది చనిపోవటం తెలిసిందే. ఈ ఉదంతం తెలుగుదేశం సర్కారు మీద ఎంత మచ్చ పడాలో అంత మచ్చ పడిన పరిస్థితి. ఇక.. చంద్రబాబును అయితే.. రాజకీయ ప్రత్యర్థులు ఫుట్ బాల్ ఆడుకున్న సంగతి తెలిసిందే. సహజంగా తాను తప్పు చేసినట్లు ఒప్పుకోవటానికి తెగ గింజుకునే చంద్రబాబు లాంటి వ్యక్తి సైతం.. తప్పు చేస్తే క్షమించాలంటూ బేలగా ప్రాధేయ పడిన పరిస్థితి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తొక్కిసలాట విషయంలో చంద్రబాబునాలుగు గంటలు పుష్కర స్నానం చేయటం వల్లనేనని.. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో.. తీసిన షాట్లు.. ఒక అంతర్జాతీయ ఛానల్  షూటింగ్ కారణంగానే ఈ భారీ తొక్కిసలాట జరిగిందంటూ చాలానే మసాలా మాటలు చెప్పారు.

ఈ అంశంపై ఒక తెలంగాణ పోలీసు సీనియర్ అధికారి చెప్పిన వాదన తొక్కిసలాటలో సరికొత్త కోణాన్ని చెప్పకనే చెబుతోంది. సదరు అధికారి చంద్రబాబును పెద్దగా ఇష్టపడని వ్యక్తి కావటం మరో గమనార్హం. ఇంతకీ ఆయన చెప్పిన అంశాలు చూస్తే.. రాజకీయ నాయకులు కానీ.. మీడియా కానీ అసలు విషయాల్ని వదిలేసి మసాలా విషయాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఇట్టే తెలుస్తుంది.

తొక్కిసలాట ఎందుకు జరిగిందన్న దానిపై సదరు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి వినిపించిన వాదన.. ఆయన మాటల్లోనే చెప్పాలంటే..

‘‘చంద్రబాబు పుష్కర స్నానం చేసినంత వరకు భారీగా వచ్చిన జనాన్ని పోలీసులు ఆపేశారు. బాబు వెళ్లిపోయిన తర్వాత.. అప్పటివరకూ భద్రత వ్యవహారాల్ని చూసిన పోలీసులు ఎవరికి వారు తమ దారిన తాము వెళ్లిపోయారు. ఎవరూ అక్కడ ఉండలేదు. పరిస్థితి పెద్దగా పట్టించుకోలేదు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న జనాలు కంట్రోల్ తప్పితే ఎంత ప్రమాదమన్న విషయాన్ని ఉన్నతాధికారులు కూడా పట్టించుకోలేదు. ఇక.. పోలీసులు ఎందుకు వెళ్లిపోయారన్న విషయంలో చాలానే కీలకాంశాలు ఉన్నాయి. పుష్కరాల కోసం డ్యూటీ వేసిన పోలీసులకు.. ఇచ్చే డీఏ మామూలు కంటే తక్కువ కావటం ఒక కీలక అంశం. అంతేకాదు.. పుష్కర ఘాట్ల దగ్గర డ్యూటీ వేసిన పోలీసులకు టిఫిన్.. భోజనం లాంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఎవరికి వారు వారి ఏర్పాట్లు చూసుకోవాలి. ఘాట్లకు దగ్గర్లో భోజనవసతి లేదు. వారికి అదనపు శ్రమతో పాటు.. ఆర్థికంగా భారం వేసేవి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ వారిని తీవ్ర నిరాశలోకి నెట్టేశాయి. చేస్తున్న డ్యూటీ పట్ల వారికి కమిట్ మెంట్ లేకుండా చేశాయి. షోకుల కోసం కోట్ల రూపాయిలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. పోలీసులకు కనీసం తిండి పెట్టాలని.. వారికి ఆకలి దప్పులు లేకుండా చూడాలన్న ఆలోచన లేదు. ఈ అసంతృప్తి వారి డ్యూటీ మీద ప్రభావం చూపించింది. ఏదో చేశామంటే చేశామన్నట్లుగా డ్యూటీ చేశారే తప్పించి.. కమిట్ మెంట్ లోపించింది. అదే.. 27 మంది నిండు ప్రాణాలు తీసేలా చేసింది. వేలాది కోట్ల రూపాయిల ఖర్చుతో నిర్వహించే పుష్కరాల ఏర్పాట్లతో.. కోటి రూపాయిలు కూడా ఖర్చు కాని తిండి గురించి ఆలోచించని ఉన్నతాధికారుల కక్కుర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు తల దించుకునేలా చేసింది’’ అంటూ సుదీర్ఘంగా వివరించారు.​
Tags:    

Similar News