రోహిత్ వేముల మ‌ర‌ణానికి ప్ర‌తీకారం..వీసీ హ‌త్య‌కు కుట్ర‌

Update: 2018-03-31 13:17 GMT
హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామంతో తెర‌మీద‌కు వ‌చ్చింది. వీసీ అప్పారావు హత్యకు చేసిన కుట్రను  తూర్పుగోదావరి జిల్లా పోలీసులు భగ్నం చేశారు. వ‌ర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల ఘటనకు ప్రతీకారంగా వీసీ అప్పారావు హత్యకు మావోయిస్టు పార్టీ కుట్ర చేసిందని పోలీసులు తెలిపారు. భధ్రాచలం - చర్ల రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా చందన్ మిశ్రా - పృధ్విరాజ్ అనే వ్య‌క్తులు పోలీసులకు చిక్కారు. తెలంగాణ రాష్ట్ర చంద్రన్నదళ సెంట్రల్ కమిటీ సభ్యుడు హరిభూషణ్ అలియాస్ యాపా నారాయణ ఆదేశాలతో హత్యకు పథ‌క రచన చేసినట్టు పోలీస్ విచారణలో నిందితులు వెల్లడించారు.

తూర్పుగోదావ‌రి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని మీడియాతో మాట్లాడుతూ వీసీ హ‌త్య‌కు సంబంధించిన కుట్ర‌ను తాము ఛేదించామ‌న్నారు. కోల్‌కతాకు చెందిన చందన్ మిశ్రా హెచ్.సి.యులో ఎంఏ పీజీ విద్యార్థి అని తెలిపారు. పృధ్విరాజ్ కృష్ణ జిల్లా కేసరిపల్లి వాసి అని వివ‌రించారు. ఇద్దరికీ హెచ్‌సీయూలో పరిచయం అయింద‌ని చెప్పారు. అయితే రోహిత్ వేముల అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాల‌తో వీరు మావోయిస్టులకు ద‌గ్గ‌ర‌య్యార‌ని,ఈ క్ర‌మంలోనే కుట్ర‌కు ప్ర‌ణాళిక ర‌చించార‌ని తెలిపారు.

కాగా, ఈ ప‌రిణామంపై వీసీ అప్పారావు స్పందించారు. త‌నకు ఎటువంటి బెదిరింపులు రాలేదని ఆయ‌న తెలిపారు. త‌న‌ను చంపడం కోసం ఎవరు కుట్ర చేసారో కూడా తెలియ‌ద‌ని అన్నారు. పోలీసులు కూడా త‌నకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని వీసీ వివ‌రించారు. ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ ప్రశాంతంగా ఉందన్నారు.

Tags:    

Similar News