హై అల‌ర్ట్ః ఆర్కే బీచ్‌ కు వ‌చ్చే వాహ‌నాలు సీజ్‌

Update: 2017-01-26 06:15 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు శ్రీ‌కారం చుట్టిన నేప‌థ్యంలో అందరి దృష్టి విశాఖ పైనే ఉంది. మొన్నటి వరకూ అంతగా పట్టించుకోని ప్రత్యేక హోదా ఉద్యమం ఒక్క సారిగా ఊపిరిపోసుకుంది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమంతో అనుకున్నది సాధించుకున్న తమిళుల పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సమాయత్తం కావడం, దీనికి కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు పలకడంతో ఉద్యమానికి కొత్త రూపు సంతరించుకుంటోంది. అయితే ఈ ఉద‌యం వ‌స్తున్న వాహ‌నాల‌ను పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకుంటున్నారు. టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర మోహ‌రించిన పోలీసులు యువ‌త‌ను వెన‌క్కి వెళ్లాలంటూ ఆదేశిస్తున్నారు.

ఆర్కే బీచ్ కేంద్రంగా ఆంధ్రుల గ‌ళం వినిపించేందుకు వ‌స్తున్న యువ‌త‌ను వెనక్కి పంపేందుకు ప్ర‌య‌త్నిస్తున్న పోలీసులతో ఈ సంద‌ర్భంగా ప‌లువురు యువ‌కులు గొడ‌వ‌ల‌కు దిగుతున్నారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తిలో నిర‌స‌న తెలిపేందుకు వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో యువ‌త‌ను అడ్డుకోలేని పోలీసులు వారి వాహ‌నాల‌ను సీజ్ చేస్తామ‌ని హెచ్చరిస్తున్నారు. దీంతో విశాఖ వైపు దారి తీస్తున్న ర‌హ‌దారుల్లో ఉత్కంఠ నెల‌కొంది.

ప్ర‌త్యేక‌ హోదా ఉద్యమాన్ని ఈ నెల 26న గణదినోత్సవం సందర్భంగా ఉధృతం చేయాలని అన్ని వర్గాలు భావించిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆంధ్రా యువత పేరిట జనసేన ప్రతినిధులు ఆర్‌ కె బీచ్ వేదికగా మౌన దీక్ష చేపట్టడం, అదే రోజు సాయంత్రం వైకాపా ఆధ్వర్యంలో ఆర్‌ కె బీచ్ నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో ఆర్‌కె బీచ్ వైపే రాష్ట్రం చూస్తోందనడంలో సందేహం లేదు. ఇక అధికార - విపక్ష నేతలిద్దరూ ఈ నెల 26న విశాఖలో గడపనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, అందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లోను కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని వైకాపా అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఉద్యమంలో భాగంగా విశాఖలో గురువారం సాయంత్రం అర్‌కె బీచ్ వేదికగా జరిగే ప్రదర్శనలో తాను స్వయంగా పాల్గొంటానంటూ ప్రకటించారు. అన్నట్టే గురువారం సాయంత్రం జగన్ విశాఖ చేరుకుని ఆర్‌ కె బీచ్‌ లో వైకాపా తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధపడ్డారు. అయితే గణతంత్ర దినోత్సవం - అనంతరం రెండు రోజుల పాటు విశాఖ వేదికగా జరుగుత్నున రెండవ భాగస్వామ్య సదస్సు దృష్ట్యా ఎటువంటి ప్రదర్శనలు - ర్యాలీలు - సభలకు అనుమతి లేదంటూ పోలీసు యంత్రాంగం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ విపక్ష నేత విశాఖ ర్యాలీలో పాల్గొనేందుకే సిద్ధ పడుతున్నారు. ఆర్‌ కె బీచ్ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకూ ప్రదర్శనలో పాల్గొంటారు.

మ‌రోవైపు రెండు రోజుల పాటు విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి 8 గంటలకే విశాఖ చేరుకోనున్నారు. ఆర్‌ కె బీచ్‌ కు సమీపంలోని నోవాటెల్ హోటల్‌ లో ఆయన బసచేయనున్నారు. దీంతో ఒకే సమయంలో అధికార - విపక్ష నేతలిద్దరూ విశాఖలోనే గడపనున్నారు. అయితే వైకాపా తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తోందని సమాచారం. ఇప్పటికే నగరంలో పోలీసు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అనుమతి లేకుండా సమావేశాలు - ప్రదర్శనలు నిర్వహించకూడదని, ఎవరైన ధిక్కరిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఆంధ్రా యువత పేరిట జనసేన కార్యకర్తలు ప్రత్యేక హోదా కోసం గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఆర్‌కె బీచ్ వేదిగా మౌన‌ దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. దీనికి కూడా పోలీసులు అనుమతివ్వలేదు. మౌన‌ దీక్షకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు - యువతను సమీకరిస్తున్నారు. మొత్తంగా ఆర్‌ కే బీచ్‌ లో వైకాపా - ఆంధ్రా యువత తలపెట్టిన ప్రదర్శనలకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News