పోలీసులు నన్ను చంపేస్తామన్నారు

Update: 2017-04-08 09:37 GMT
ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య  కేసులో ఎనిమిదేళ్లు జైల్లో ఉండి.. ఇటీవల కోర్టు నిర్దోషిగా తేల్చడంతో బయటకొచ్చిన సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పోలీసులే తనను ఇందులో ఇరికించారని.. తనకు అయేషా ఎవరో కూడా తెలియదని చెప్పాడు. నేరం చేసినట్టు ఒప్పుకోవాలని... లేకపోతే, చంపేస్తామంటూ పోలీసులు తనను వేధించారని సత్యంబాబు తెలిపాడు.  అంతేకాదు... తనతో పాటు తన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామని బెదిరించారని చెప్పాడు.
    
పోలీసులు ఎనిమిదేళ్ల పాటు తనను జైల్లో ఉంచి నరకయాతనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. వాస్తవానికి ఆయేషాను తాను ఎన్నడూ చూడనేలేదని చెప్పాడు. అన్యాయంగా తనను కేసులో ఇరికించారని వాపోయాడు. ఆయేషాను హత్య చేశానని తాను ఒప్పుకున్నట్టు విడుదలైన సీడీ కూడా పోలీసుల సృష్టేనని తెలిపాడు. హైకోర్టు తీర్పుతో తాను నిర్దోషిననే విషయం అందరికీ అర్థమయిందని అన్నాడు. తన భవిష్యత్తు ఏమిటనేది ఇంకా నిర్ణయించుకోలేదని సత్యంబాబు చెప్పాడు.
    
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిదేళ్ల కిందట బీ ఫార్మసీ విద్యార్దిని ఆయేషా మీరా హత్య జరిగింది.  ఈ కేసులో పోలీసులు నిందితుడిగా చూపించిన సత్యంబాబుకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే దీనిపై సత్యం బాబు హైకోర్టును ఆశ్రయించాడు.  వాదనలు విన్న కోర్టు వారం కిందట సంచలన తీర్పిచ్చింది. ఎటువంటి ఆధారాలు లేకుండా సత్యంబాబును జైల్లో పెట్టారని పోలీసులను మందలించింది. సత్యంబాబుకు రూ. లక్ష నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే.. పోలీసులు మాత్రం ఎలాగైనా సత్యంబాబే దోషని నిరూపించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారు. కేసులు పెద్ద వ్యక్తులు ఉన్నందున వారిని తప్పించేందుకే సత్యం బాబును బలిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News