బొత్స... చలో ఢిల్లీ... ?

Update: 2021-10-19 10:30 GMT
వైసీపీలో సీనియర్ మంత్రి, విజయనగరం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ రాజకీయ భవిష్యత్తు మీద తీవ్రంగా చర్చ సాగుతోంది. బొత్సను మంత్రి మండలిలో కొనసాగిస్తారా లేదా అన్న డౌట్ అయితే ఆయన అనుచరుల్లో ఇపుడు బలంగా ఉంది. అయితే తమ నేతను కదిపే పరిస్థితి లేదని కూడా ఎవరికి వారు సర్దిచెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మొత్తానికి మొత్తం క్యాబినేట్ ని ప్రక్షాళన చెస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే బొత్స మంత్రి సీటు కూడా గల్లంతు కావడం ఖాయమే తెలుస్తోంది. అయితే బొత్సని పక్కన పెట్టినా జగన్ ఆయనకు పార్టీలోనూ ఇతరత్రా కూడా సముచిత స్థానం కల్పిస్తారు అంటున్నారు.

బొత్సకు ఉత్తరాంధ్రా జిల్లాల పార్టీ బాధ్యతలను అప్పగించడంతో పాటు వచ్చే ఏడాది ఖాళీ కానున్న ఆరు సీట్లో ఒకదాని నుంచి రాజ్యసభకు పంపుతారు అని అంటున్నారు. అలా పెద్దల సభలో బొత్సకు ప్రాముఖ్యత కల్పిస్తారు అన్నదే వైసీపీ వర్గాల టాక్. అదే సమయంలో బొత్స వారసుడిగా ఆయన కుమారుడు డాక్టర్ సందీప్ కి రాజకీయంగా అవకాశాలు ఇస్తారని కూడా తెలుస్తోంది. ఒకవేళ బొత్సను మంత్రి వర్గంలో కంటిన్యూ చేస్తే 2024 నాటికైనా ఆయనను రాష్ట్ర రాజకీయాల నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేస్తారు అన్న మాట కూడా ఉంది. బొత్సను వచ్చే ఎన్నికల్లో విజయనగరం నుంచి లోక్ సభకు పోటీ చేయిస్తారు అని చెబుతున్నారు. అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న బొత్సను ఎంపీ క్యాండిడేట్ చేస్తే సునాయాసంగా విజయం దక్కుతుంది అన్నది వైసీపీ పెద్దల ఆలోచనగా ఉందిట.

ఇక బొత్స చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గత రెండున్నర దశాబ్దాలుగా అదే సీటు నుంచే బరిలో ఉంటున్నారు. చీపురుపల్లి అంటే కేరాఫ్ బొత్సగా పేరు గడించింది. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ రాష్ట్రమంతా డిపాజిట్లు కోల్పోయినా బొత్స టీడీపీకి టఫ్ ఫైట్ ఇచ్చి రెండవ స్థానంలో నిలిచారు అంటే అక్కడ ఆయన సొంత పలుకుబడి బాగా ఉందనే చెబుతారు. ఈ నేపధ్యంలో బొత్సను కనుక ఢిల్లీకి పంపితే చీపురుపల్లిలో వైసీపీకి విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.

ఇక్కడ మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు, జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కిమిడి నాగార్జున బలంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. దాని కోసం ఆయన ఇప్పటినుంచే గట్టి కసరత్తు చేస్తున్నారు. బొత్స ప్రత్యర్ధిగా ఉంటే నాగార్జున విజయం కష్టమనే అభిప్రాయం ఈ రోజుకీ ఉంది. ఆయన కనుక తప్పుకుంటే ఇక్కడ నాగార్జున గెలుపునకు ఢోకా లేదని టీడీపీ వర్గాల మాటగా ఉంది. మరి కుమారుడు డాక్టర్ సందీప్ ని చీపురుపల్లి నుంచి పోటీకి దింపి బొత్స చక్రం తిప్పితే రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా జిల్లా రాజకీయాల నుంచి బొత్సను పక్కన పెట్టి ఢిల్లీకి షిఫ్ట్ చేయాలన్న వైసీపీ ప్లాన్ ని బట్టి టీడీపీ కూడా తన పావులను కదిపే అవకాశాలు ఉన్నాయిక్కడ.




Tags:    

Similar News