పోరాటం ప్రత్యేక హోదా కోసమా..? ఆ క్రెడిట్ కోసమా?

Update: 2016-05-21 11:30 GMT
 ఏపికి ప్రత్యేక హోదా అంశంపై ఏపీతో పాటు ఢిల్లీలోనూ రాజకీయ వేడి రాజుకొంటోంది. ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని అప్పట్లో మునికోటి ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఏపి ప్రజల ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఉద్యమం చల్లారింది. అయితే... ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి ఏపికి ప్రత్యేకహోదా రాదు అని చెప్పడంతో మరోసారి ఏపిలో రాజకీయ వేడి మొదలైంది. ప్రజాగ్రహానికి అనుగుణంగా ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ స్పీడు పెంచుతున్నాయి. ఈ క్రమంలో పోరాటంలో చివరకు ఏదో ఒక్కపార్టీకే క్రెడిట్ దక్కుతుందన్న చర్చ ఓవైపు సాగుతుంటే ఆ ఒక్కపార్టీ ఏదీ అన్న చర్చ మరోవైపు కొనసాగుతోంది.

ఏపికి ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతోసహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - సిపిఐ - సిపిఎం పార్టీ ఆందోళన ఉధృతం చేస్తోంది. అధికార టిడిపితోపాటు ఆ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బిజెపి మాత్రం ఏపికి ప్రత్యేక హోదా విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకొంటూ సమయాన్ని సాగదీస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం కొంత నైరాశ్యంలో ఉనన ఏపి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ తరువాత అన్ని పార్టీల కంటే ముందే ఏపికి ప్రత్యేక హోదా విషయంలో గళం విప్పింది.  ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం గళం ఎత్తినా కేవలం ప్రకటనల వరకే పరిమితం అయింది. ఇక వామపక్షా పార్టీలలో సిపిఐ ముందుగా ఈ ప్రత్యేక హోదా గళం ఎత్తుకొంది. మరోవైపు సినీ నటుడు శివాజీ బిజెపిని వీడాక వ్యక్తిగతంగా ప్రత్యేక హోదా విసయమై ఆయన పోరాటం చేశారు. ఇదిలావుంటే తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం ఏపి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇటీవల కొన్ని నెలల కిందట ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునికోటి ఏపికి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో ఒక్కసారిగా ప్రత్యేక హోదా విషయంలో నాడు రాజకీయ వేడి పెరిగింది. ఈ ఘటనపై అధికార పార్టీతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు దిగ్భ్రాంతిని వ్యక్తంచేశాయి. ఇదే క్రమంలో ఢిల్లీలో ధర్నాకు అప్పటికే పిలుపునిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం సందర్భంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున్న నిరసనకు దిగింది. ప్రత్యేక హోదా ఏపికి హక్కు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ ఏపిలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసినా క్రమంగా సద్దుమణిగిపోయింది.

కానీ, ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, రాదు కానీ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మరోసారి ఏపికి ప్రత్యేక హోదా అంశంపై రాజకీయ వేడి రాజుకొంది. తొలినుంచి ప్రత్యేక హోదాపై గళం ఎత్తిన కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఈ అంశపై ఆ పార్టీ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టి టిడిపి - బిజెపిని ఇరకాటంలోకి నెట్టింది. పార్లమెంటు స్థాయిలోనూ తమ పార్టీ పోరాటం చేస్తున్నామని, ప్రత్యేక హోదా విషయంలో తమదే నిజమైన పోరాటం అని ఏపి కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

మరోవైపు ఏపికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ఏపిలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అసెంబ్లీలో - పార్లమెంటులో తమ పార్టీకి ఉన్న సంఖ్యా బలం రిత్యా తమ పార్టీకే ప్రత్యేక హోదా విషయంలో ప్రజల నమ్మకం లభిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ జనం క్రెడిట్ పొందడం కోసం అంతర్గతంగా వ్యూహాలు రచిస్తున్నాయి.

అయితే.. పార్టీల పోరాటాలన్నీ ప్రత్యేక హోదా సాధాన క్రెడిట్ కోసం.. ప్రజల్లో ఆ ముద్ర వేయించుకోవాలని చేస్తున్నారు కానీ, నిజంగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది తక్కువే. అలాంటి లక్ష్యమే ఉంటే హోదా పోరాటం ఇప్పటికి మహోజ్వలంగా ఉండేది.
Tags:    

Similar News