కిటకిటలాడుతోన్న పార్టీ కార్యాలయాలు!

Update: 2018-09-05 08:48 GMT
ముందస్తు ఖరారైంది. తెలంగాణలో ఎన్నికల కాక పుట్టింది. ఈ వేడి అన్ని రాజకీయ పార్టీలలో రాజుకుంది. దీంతో ఇన్నాళ్లు సందడి లేని వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలలో హంగామా మొదలైంది. ఇంత వరకూ తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర‌ సమితి కార్యాలయం - ప్రగతి భవన్ నిరంతరం సందడిగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ ఎవరైన అగ్రనాయకులు వచ్చినప్పుడు - పార్టీ సమావేశాల సమయంలోనూ కార్యకర్తలతో కళకళలాడేది. మిగతా సమయాలలో గాంధీ భవన్ వెలవెలబోయేది. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయమైతే మనిషేలేని రాజభవనంలా ఉండేది.  కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యాలయం కూడా అప్పుడప్పుడు కార్య‌కర్తలతో ఉండేది. వామపక్ష పార్టీల కార్యాలయం ఎప్పుడూ ఒకే తీరు.

అయితే, ముంద‌స్తు ఎన్నిక‌ల ఖ‌రారు నేప‌థ్యంలో ఇప్పుడు అన్ని పార్టీల పరిస్థితి మారింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో అన్ని పార్టీల కార్యాలయాలు నాయకులు - వారి అనుచరగణం - కార్యకర్తలతో నిండిపోతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులు వారి పార్టీ కార్యాలయాలకు తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ముందుగా ఎన్నికల నగారా మోగించడంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి ప్రగతి భవన్‌కు కార్యకర్తలు నాయకులు తరలివస్తున్నారు. దీంతో ఆ కార్యాల‌యాలలో పండగ వాతావరణం నెలకొంది. రానున్న ‍యాభై రోజులలో వంద బహిరంగ సభలు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర‌ సమితి నిర్ణయించింది. ఈ సభల ఏర్పాట్లు - పర్యవేక్షణ‌ వంటి అంశాలపై చర్చించేందుకు అన్ని జిల్లాల నాయకులు తెరాస ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌ కూడా నాయకులు - కార్యకర్తలతో కళకళలాడుతోంది. ఈ పార్టీ కూడా తాము నిర్వహించే సభల సంఖ్యను ప్రకటించక పోయిన‌ప్ప‌టికీ....భారీగానే సభలను నిర్వహించాలని భావిస్తోంది. ఎన్నికలలోపు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వీలైనన్ని ఎక్కువ సార్లు తెలంగాణాకు తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దీంతో వీటిపై చర్చించేందుకు వస్తున్న నాయకులతోను, కార్యకర్తలతోను గాంధీభవన్ కిటకిటలాడుతోంది. ముందస్తు ఎన్నికల పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలోనూ నాయకులు, కార్యకర్తల సందడి ఎక్కువైంది. పొత్తులు ఖరారైన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మరింత మంది నాయకులు వచ్చే అవకాశం ఉంది. ఇక కమలానాథులు కూడా వారి ప్రధాన కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు. ఎన్నికల వేళ తెలంగాణలో మరో నాలుగు నెలల పాటు ఈ సందడి నెలకొంటుందని అంటున్నారు.
Tags:    

Similar News