రాజకీయాలకు కొత్త రంగులద్దుతున్నారు

Update: 2017-07-23 05:46 GMT
రాజకీయ నేతలంటే ఎలా ఉంటారు..? తామున్న పార్టీలోకే ప్రత్యర్థి వచ్చి చేరితే తాము వెంటనే ఉన్న పార్టీని వదిలి అవతలి పార్టీలో చేరిపోవాలి. తాను అధికారంలోకి రాగానే అంతకుముందు ఉన్న ప్రత్యర్థి పార్టీ నేతల ఫొటో అన్నది ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ కనిపించకుండా చేస్తారు. పథకాలకు ఆ పార్టీ వ్యక్తుల పేర్లు మార్చేస్తారు. ఇవన్నీ ఎంతో కాలంగా చూస్తున్నవే. ఇటీవలే కాలంలో మాత్రం కొందరు నేతలు పూర్తిగా కాకున్నా కొంతమేర ఇలాంటి నేరోమైండెడ్ నెస్ నుంచి బయటపడుతున్నారు. రాజకీయంగా పైచేయి సాధించడానికి ఏమైనా చేసినా కూడా ప్రజలకు సంబంధమున్న అంశాల్లో మాత్రం వారు ఇలాంటిదానికి దూరంగా ఉంటున్నారు. కొంత సామాజిక ప్రయోజనాన్ని మైండ్ లో పెట్టుకుంటున్నారు.
    
ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ అధికారంలోకొచ్చీరాగానే తీసుకున్న చర్య ఇండియాలోని రాజకీయ నాయకులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. యోగి కంటే ముందు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ బొమ్మతో కూడిన 20లక్షల స్కూల్‌ బ్యాగ్స్‌ ను గత ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే వాటిని విద్యార్ధులకు అందించడానికి ముందే యోగీ సీఎం పోస్టులోకి వచ్చేశారు.  అవన్నీ గోదాముల్లో మూలుగుతున్న విషయం యోగి గుర్తించారు. బొమ్మ ఎవరిది అయితేనేం... విద్యార్థులకు బ్యాగులు అందడం ముఖ్యమని భావించారు. పైగా 20 లక్షల స్కూలు బ్యాగులను వృథాగా పడేస్తే ఎంతో నష్టమని గుర్తించారు. అంతే... పాత సీఎం ఫొటోతో ఉన్న బ్యాగులనే పంచిపెట్టేశారు.
    
అలాగే మోడీ  కూడా.. దేశవ్యాప్తంగా రాజకీయ నేతలకున్న భద్ర తా అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనవసర భద్రతను తగ్గించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల కార్లపై ఉన్న ఎర్రబుగ్గల్ని తీసేసారు. సొంత పార్టీ నేతలకూ అవసరం లేని వారికి భద్రత తగ్గించారు. కాన్వాయ్‌ లో వాహనాల్ని తగ్గించారు. అంబులెన్స్‌ సైరన్‌ హారన్‌ విని ప్రధాని కాన్వాయ్‌ కూడా పక్కన ఆగాల్సిందేనంటూ ప్రోటోకాల్‌ కు సరికొత్త భాష్యం చెప్పారు. ఇప్పుడు మరికొందరు ముఖ్యమంత్రులు కూడా మోడీ బాటనే అనుసరిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంబులెన్స్‌కు తన కాన్వాయ్‌ ను ఆపించి సైడిచ్చారు.
    
ప్రపంచవ్యాప్తంగా మరి కొందరు నేతలూ ఇలాంటి ప్రోటోకాల్‌ నిబంధనల్ని పాలకులు పక్కనపెడుతున్నారు. నేరుగా ప్రజల్తో కలిసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బ్రిటన్‌ ప్రధాని లండన్‌ లోని తన నివాసం నుంచి కార్యాలయానికి కొంతదూరం నడిచెళ్ళి మరీ మెట్రోరైల్‌ పై ప్రయాణించి చేరుకుంటున్నారు.
    
కెనడాలో ప్రధాని, మంత్రులు కూడా తమ కార్యాలయాలకు ప్రజా రవాణా వ్యవస్థలో వెళ్తున్నారు. స్వీడన్‌ లో కూడా ఇదే పరిస్థితి. ఈ దేశాల్లో మంత్రులు, ప్రధానమంత్రులకున్న అధికారిక వాహనాల్ని ఎప్పుడూ వ్యక్తిగత పనులకు వినియోగించరు. కార్యాలయం నుంచి ఇంటికి చేరిన వెంటనే వాహనాన్ని తిరిగి కార్యాలయానికి పంపేస్తారు.
    
మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, పాలకులకు మధ్య దూరం పూర్తిగా చెరిగిపోయే రోజొస్తే అది నిజంగా అద్భుతమే.
Tags:    

Similar News