పొంగులేటి బెదిరింపు బాగానే పనిచేసిందే!

Update: 2015-09-27 04:14 GMT
''నేను ఢిల్లీకి వెళ్లి మేడంకు కంప్లయింటు చేస్తా'' అని పొంగులేటి సుధాకరరెడ్డి బెదిరించిన వెంటనే... టీపీసీసీ మొత్తం కంగారెత్తిపోయారో లేదో తెలియదు గానీ.. మొత్తానికి సంబంధం లేని అంశాన్ని తీసుకువచ్చి.. తెలంగాణ శాసనసభలో చర్చ సాగించడనికి సిద్ధపడిపోయారు. ఇలాంటి చర్చ వలన పార్టీకి గానీ - ప్రజలకు గానీ - రాష్ట్రానికి గానీ ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదా? అనే విషయంలో టీ కాంగ్రెసు నాయకులకు ఎంత మాత్రం క్లారిటీ ఉన్నదో తెలియదు. కాకపోతే.. పొంగులేటి సుధాకరరెడ్డి బెదిరించాడు గనుక.. అసెంబ్లీ సమావేశాల్లో ఒక పాయింటు లేవనెత్తడానికి వారు సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇటీవలి టీకాంగ్రెసు నాయకులంతా కలిసి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఒక సమావేశం పెట్టుకున్నారు. అందులో రకరకాల అంశాల గురించి మాట్లాడుకున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రత్యక్ష ఎన్నికల్లోకి కూడా దిగాలని చాలా కాలంగా ఉబలాటపడుతున్న ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఈసమావేశంలో పోలవరం డ్యాం నిర్మాణం గురించి కూడా తెలంగాణ అసెంబ్లీలో చర్చించాలంటూ ఒక పాయింటు లేవనెత్తారు. పోలవరం సంగతి ఏపీ అసెంబ్లీనే పట్టించుకోని వాతావరణం ఉన్న ప్రస్తుత సమయంలో.. దాన్ని గురించి తెలంగాణ అసెంబ్లీలో చర్చించడం అనేది చిత్రమైన అంశమే. పైగా పోలవరం ముంపు గ్రామాలను మొత్తం విభజన చట్టం ద్వారానే ఏపీలో కలిపేశారు. ఇక తెలంగాణకు, పోలవరం పట్ల ఎలాంటి అభ్యంతరాలు ఉండని పరిస్థితిని గత కాంగ్రెస్‌ ప్రభుత్వమే కల్పించింది.
ఇలాంటి అన్ని కారణాలు దృష్టిలో ఉంచుకుని పొంగులేటి లేవనెత్తిన పాయింటు గురించి ఆ సమావేశంలో నాయకులెవరూ పట్టించుకోలేదు. దాంతో ఆయన అలక వహించి, 'నేను సోనియా రాహుల్‌ లకు కంప్లయింటు చేస్తా' అంటూ సమావేశంనుంచి వెళ్లిపోయారు. టీపీసీసీ కి జడుపు వచ్చిందో ఏమో.. ఆపాయింటు మీద అసెంబ్లీలో పోరాడడానికి సిద్ధమవుతున్నారు.
 
పోలవరం అనేది వరదజలాలు వృథాగా పోకుండా కాపాడుకోవడానికి కట్టుకుంటున్న ప్రాజెక్టు. దానివల్ల మునిగే అవకాశం ఉన్న గ్రామాలు.. ఆల్రెడీ ఏపీకి వెళ్లిపోయాయి. ఇక వీరు దేనికోసం పోరాడాలనుకుంటున్నారు. ఒకవేళ ప్రమాదకరంగా డ్యాంలో జలాలు నిండితే ఎటూ సముద్రంలోకి వదిలేస్తారు. పైగా, ఇప్పుడు పట్టిసీమ రూపంలో కృష్ణలోకి గోదావరి జలాలను అనుసంధానించడం కూడా పూర్తయ్యాక.. అర్థంలేని భయాల గురించి.. తెలంగాణ అసెంబ్లీలో ఆందోళన చెయ్యడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పోలవరం పనులే జరగడం లేదు మొర్రో అని ఆ రాష్ట్రంలో పాలకపక్షం తప్ప అందరూ విలపిస్తూ ఉంటే.. ఆ ప్రాజెక్టు నిర్మాణం, దాని పర్యవసానాల గురించి.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించడానికి కాంగ్రెస్‌ పోరాడుతుందిట. అసలు ఆ ప్రాజెక్టు, అనుమతులు, జాతీయహోదా అన్నీ తమ పార్టీ ఇచ్చినవే అనే సంగతి వారికి గుర్తున్నదో లేదో అర్థం కావడం లేదు.
Tags:    

Similar News